
కొత్త రేషన్ కార్డుల (New Ration Cards) కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. రేషన్‌కార్డుల కోసం మీసేవ కేంద్రాల్లో (Mee Seva) దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం ప్రకటించి 24 గంటలు కూడా గడవకముందే మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులను నిలిపివేసింది. ప్రభుత్వ ప్రకటనతో కేంద్రాల వద్దకు బారులు తీరిన జనం గంటల తరబడి అక్కడే వేచి చూస్తున్నారు.
అసలేం జరిగిందంటే..?
కొత్త రేషన్ కార్డుల కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ మీసేవ కమిషనర్‌కు పౌరసరఫరాల శాఖ తాజాగా లేఖ రాసింది. రేషన్ కార్డుల డేటా బేస్‌ను మీసేవకు అనుసంధానం చేయాలని ఎన్‌ఐసీ (NIC)ని కోరింది. ప్రభుత్వ ప్రకటనతో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునేందుకు శనివారం ఉదయం నుంచే మీసేవ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు.
ఇచ్చినట్లే ఇచ్చి లాగేసుకున్నారు
అయితే దరఖాస్తుల (Ration Card Application) కోసం ఉదయాన్నే కేంద్రాల వద్దకు పరుగుతీసిన వారికి నిరాశే మిగిలింది. పలు కారణాల వల్ల మీసేవ కేంద్రాల వద్ద కొత్త రేషన్ కార్డుల సర్వీసులను ప్రభుత్వం నిలిపివేసినట్లు తెలిసింది. దీంతో దరఖాస్తుల కోసం కేంద్రాల వద్దకు చేరుకున్న వారంతా ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతున్నారు. మరోవైపు మీసేవ నిర్వాహకులపైనా తీవ్రంగా ఫైర్ అవుతూ చేసేదేం లేక వెనుదిరుగుతున్నారు. అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ లాగేసుకున్నారని వాపోతున్నారు.
సర్కారుపై హరీశ్ రావు ఫైర్
మీసేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్రంగా ఫైర్ అయ్యారు. దరఖాస్తుల పేరిట ప్రజలను ఇంకెన్ని సార్లు మోసం చేస్తారని ధ్వజమెత్తారు. ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకున్నారని.. కుల గణనలో వివరాలు తీసుకున్నారని.. గ్రామ సభల పేరుతో డ్రామా చేశారని అన్నారు. ఇప్పుడు మళ్లీ మీసేవలో దరఖాస్తులు అంటూ మరో డ్రామాకు తెరతీశారని రేవంత్ రెడ్డి సర్కారుపై విరుచుకుపడ్డారు.
దరఖాస్తుల పేరిట ఇంకెన్ని సార్లు ప్రజలను మోసం చేస్తారు రేవంత్ రెడ్డి?
ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకున్నరు.
కుల గణనలో వివరాలు తీసుకున్నరు.
గ్రామ సభల పేరిట డ్రామా చేశారు.
ఇప్పుడు మల్లా మీసేవలో దరఖాస్తులు అంటున్నరు.పథకాల పేరిట ఇన్నాళ్లు మీరు చేసిన హడావుడి స్థానిక సంస్థల ఎన్నికల… pic.twitter.com/PsZin1po6M
— Harish Rao Thanneeru (@BRSHarish) February 8, 2025