Mana Enadu : ప్రజలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త రేషన్ కార్డు (Ration Cards), పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి సదవకాశం కల్పించింది. ఇవాళ్టి (డిసెంబర్ 2) నుంచి 28వ తేదీ వరకు అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికం కావడంతో వాటి కోసం సర్కార్ దరఖాస్తులను ఆహ్వానించింది.
ప్రజలకు సంక్రాంతి కానుక
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే పింఛన్ (Pension)ను రూ.4వేలు చేసింది. దీంతో అర్హులు తమకు ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. వారి కోసమే తాజాగా ప్రభుత్వం ఫించన్లకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ దరఖాస్తులన్నీ పరిశీలించి అర్హులైన వారికి కొత్తగా కార్డులు, పింఛన్లను సంక్రాంతి కానుకగా ప్రభుత్వం ఇవ్వనుంది.
కూటమి సర్కార్ కీలక నిర్ణయం
మరోవైపు గత వైసీపీ సర్కార్ (YSRCP Govt).. కొత్త కార్డులు కావాల్సినవారు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి అయిదు రోజుల్లోనే మంజూరు చేస్తామని చెప్పి.. కొత్తవి ఇవ్వకపోగా ఆరంచెల విధానంలో వడపోసి అప్పటికే ఉన్న కార్డులను తొలగించింది. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా వివాహం జరిగితే విభజన చేసుకునేందుకూ అనుమతించలేదు. దీంతో ప్రస్తుత కూటమి ప్రభుత్వ నిర్ణయంతో బియ్యం కార్డుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
వారికి అవకాశం
రేషన్ కార్డు లేనివారు, కొత్తగా పెళ్లయిన వారు తమ పేరును కార్డులో చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. సభ్యుల తొలగింపు, వేరే కార్డులో పేరు నమోదు కూడా చేసుకోవచ్చు. రేషన్‌కార్డులకు ఆధార్ (Aadhar Card) అనుసంధానం, కొత్త వారిని చేర్చడం వంటి అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఏమైనా అనుమానాలు ఉంటే దగ్గర్లో ఉన్న అధికారులను అడిగి తెలుసుకోవాలని ఉన్నతాధికారులు తెలిపారు.






