
విద్యార్థులకు అలర్ట్. గ్రూప్-2 మెయిన్ పరీక్షల (Group 2 Main Exams)పై ఏపీపీఎస్సీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ పరీక్ష వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై ఏపీపీఎస్సీ (APPSC) కీలక ప్రకటన చేసింది. ఈ పరీక్ష వాయిదా పడలేదని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 23వ తేదీన గ్రూప్-2 మెయిన్ పరీక్ష యధావిధిగా జరుగుతుందని పేర్కొంది. ఫేక్ వార్తలు వైరల్ చేస్తున్న వారిపై విచారణ జరపాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తామని కమిషన్ అధికారులు తెలిపారు.
ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
ఆదివారం (ఫిబ్రవరి 23వ తేదీ) రోజున ఏపీ వ్యాప్తంగా గ్రూప్-2 మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్ – 1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ – 2 పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు రావాలని అధికారులు తెలిపారు. నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ హాలులోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.