చిన్నారులపై సోషల్ మీడియా (social media) ప్రభావాన్ని అరికట్టేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కీలక ముందడుగు పడింది. 16 ఏళ్ల లోపు చిన్నారులు సోషల్ మీడియా వినియోగించకుండా తీసుకురానున్న చట్టానికి సంబంధించిన బిల్లును ఆస్ట్రేలియా (Australia) ప్రతినిధుల సభ బుధవారం ఆమోదించింది. ఈ బిల్లును సెనేట్ ఆమోదిస్తే అది చట్టరూపం దాల్చుతుంది.
ఈ బిల్లును (bill) బుధవారం సభలో ప్రవేశపెట్టగా 102 ఓట్లతో ఆమోదం పొందింది. మెజార్టీ పార్టీలు బిల్లుకు అనుగుణంగా ఓటేయగా.. సభలో కేవలం మంది మాత్రమే వ్యతిరేకించారు. ఈ బిల్లును సెనేట్ ఆమోదించి చట్టరూపం దాల్చితే సోషల్ మీడియాలపై ఆదేశాలు జారీ చేస్తారు. తమ ఫ్లాట్ఫాముల్లో వయోపరిమితులు ఎలా అమలు చేస్తారన్న దానిపై సోషల్ మీడియాలకు ఏడాది పాటు సమయం ఇచ్చి.. ఈ సమయంలో చిన్నారులు సోషల్ మీడియా ఖాతా వినియోగించకుండా మార్పులు చేయాలి. నిబంధలు ఉల్లంఘిస్తే వారిపై 50 మిలియన్ ఆస్ట్రేలియా డాలర్లను (ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.273 కోట్లు) ప్రభుత్వం జరిమానాగా విధించనుంది.
ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ (anthony albanese) ఇటీవల ఈ చట్టం గురించి కాన్బెర్రాలోని ఓ సమావేశంలో ప్రకటించారు. తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కొత్త చట్టం అమలు బాధ్యత సోషల్ మీడియాలదేనని ఉగ్ధాటించారు.






