నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ హైస్కూల్ (Maganoor Zilla Parishad High School) ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం రోజుల వ్యవధిలో మూడుసార్లు ఫుడ్ పాయిజన్ (food poision) అయితే అధికారులు నిద్రపోతున్నారా? అని సీజే ప్రశ్నించారు. పిల్లలు చనిపోతే కానీ స్పందించరా? అని ప్రభుత్వంపై న్యాయమూర్తి మండిపడ్డారు. ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం.. అధికారుల నిర్లక్ష్యాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిందేనని అభిప్రాయపడ్డారు.
వివరాల సేకరణకు వారం ఎందుకు?
హైకోర్టు ప్రశ్నలపై స్పందించిన ప్రభుత్వ తరపు న్యాయవాది.. వారం రోజుల్లో ఈ ఘటనపై కౌంటర్ దాఖలు చేస్తామని కోరగా.. ఈ అభ్యర్థనపైనా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాల సేకరణకు వారం రోజులు ఎందుకని ప్రశ్నించింది. ఆదేశాలు ఇస్తే కానీ అధికారులకు పనిచేయడం చేతకాదా? అంటూ హైకోర్టు ధర్మాసనం సీరియస్ అయ్యింది.
మాగనూరు జడ్పీ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనం వికటించి ఈ నెల 20వ తేదీన 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన జరిగి వారం రోజులు కాకుండానే.. అదే స్కూల్‌లో మళ్లీ 29 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం స్కూల్‌లో మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులు ఇళ్లకు తిరిగి వెళ్తున్న సమయంలో ఒకరి తర్వాత ఒకరుగా వాంతులు చేసుకున్నారు. గమనించిన స్కూల్ టీచర్లు వారిని స్థానిక పీహెచ్‌సీకి తరలించి ట్రీట్‌మెంట్ ఇప్పించారు. మెుత్తం 29 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కాగా.. వారిలో 7 విద్యార్థులు వెంటనే కోలుకున్నారు. మిగిలిన 22 మందిని మెరుగైన చికిత్స కోసం మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
20వ తేదీ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సీరియస్‌గా స్పందించారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి ప్రధానోపాధ్యాయుడు, మండల విద్యాశాఖాధికారి, మధ్యాహ్న భోజన ఇన్‌ఛార్జ్‌లను సస్పెండ్ చేశారు. మధ్యాహ్న భోజనం సరఫరా చేసే ఏజెన్సీకి ఇచ్చిన కాంట్రాక్టును కూడా అధికారులు రద్దు చేశారు. అయితే అధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన కలకల రేపింది.