Mana Enadu : బంగ్లాదేశ్‌లో కల్లోల పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హిందువులు, హిందూ ఆలయాలపై దాడులు పెచ్చుమీరుతున్నాయి. ఈ క్రమంలోనే మైనార్టీల భద్రతపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ బంగ్లాదేశ్ (Bangladesh) మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశంలో ఇటీవల చోటుచేసుకున్న హత్యలు, తాజా అనిశ్చితిపై ఆమె స్పందించారు. దీనంతటికి కారణం తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనసేనని ఆమె ఆరోపించారు.
యూనస్ పై హసీనా కీలక ఆరోపణలు
విద్యార్థుల నిరసనలతో చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణల కారణంగా షేక్ హసీనా నాలుగు నెలల క్రితం స్వదేశాన్ని వీడారు. ప్రస్తుతం భారత్‌లోని ఓ రహస్య ప్రాంతంలో ఉంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె తాజాగా న్యూయార్క్‌లో జరిగిన అవామీ లీగ్ కార్యక్రమానికి వర్చువల్‌గా హాజరైనట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆమె యూనస్ (Muhammad Yunus)పై కీలక ఆరోపణలు చేశారని పలు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
అసలైన మాస్టర్ మైండ్ యూనసే
‘‘హత్యలకు కారణమయ్యానంటూ నాపై కేసులు పెడుతున్నారు. నిజానికి విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి ఆందోళనలకు కుట్ర పన్నింది మహమ్మద్ యూనస్. బంగ్లాలో ఉపాధ్యాయులు, పోలీసులపైన దాడులు జరుగుతున్నాయి. మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని.. ప్రార్థనా మందిరాలపై దాడులు చేస్తున్నారు. వీటన్నింటి వెనక ఉన్న అసలైన మాస్టర్ మైండ్ యూనసే’’ అని హసీనా (Bangladesh Ex PM Sheikh Hasina) తీవ్ర ఆరోపణలు చేశారు.
అందుకే దేశాన్ని వీడా
ఇదే సమావేశంలో షేక్ హసీనా.. తాను దేశాన్ని ఎందుకు వీడాల్సివచ్చిందో చెప్పుకొచ్చారు. తన తండ్రిలాగే తననూ హత్య చేసేందుకు కుట్రలు జరిగాయని.. వాటిని ఎదుర్కోవడానికి తనకు 25-30 నిమిషాలు పట్టదని అన్నారు. తన భద్రతా సిబ్బంది కాల్పులు జరిపితే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయేవారని.. కానీ, ఊచకోతను తాను కోరుకోలేదని వెల్లడించారు. తాను అధికారం కోసం అక్కడే ఉంటే మారణహోమం జరిగేదని.. ప్రజలను విచక్షణారహితంగా చంపేస్తుండటంతోనే దేశం విడిచివెళ్లిపోవాలని నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు.






