Mana Enadu : ఎత్తైన కొండలు.. ఎటుచూసినా పచ్చని అందాలు.. కనుచూపు మేరా ముగ్ధమనోహర రమణీయ దృశ్యాలు.. గలగలలాడే సెలయేళ్లు.. పక్షుల కిలకిలరావాలు.. తెలుపు వర్ణంలో మెరిసిసోయే మంచు దుప్పట్లు.. కొండ అంచుల్లో మైమరిపించే అటవీ అందాలకు నిలయం “లంబసింగి (Lambasingi)”. “ఆంధ్రా కశ్మీర్”గా కనువిందు చేస్తున్న లంబసింగి అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి మంచుకురిసే ఈ వేళలో లంబసింగి టూర్ కు వెళ్దామా?
విశాఖ మన్యానికి మణిహారంగా కనువిందు చేస్తున్న లంబసింగిలో ఈ శీతాకాలం పర్యటిస్తే ఎంత హాయిగా ఉంటుందో. ఇక కుటుంబంతో అయినా.. స్నేహితులతో అయినా ఇక్కడికి జాలీ ట్రిప్ వెళ్తే జాలీగా ఎంజాయ్ చేయొచ్చు. మరి లంబసింగి(Lambasingi Trip)లో ఏయే ప్రాంతాలు సందర్శించవచ్చు.. అక్కడ ఎలాంటి ఫుడ్ దొరుకుతుంది ఈ స్టోరీలో తెలుసుకుందాం రండి.
విశాఖపట్నం నుంచి 100 కిలోమీటర్ల దూరంలో లంబసింగి పర్యాటక కేంద్రానికి కారు లేదా బైక్ మీద చేరుకోవచ్చు. విశాఖపట్నం నుంచి అనకాపల్లి మీదుగా తాళ్లపాలెం జంక్షన్, నర్సీపట్నం వెళ్తే.. అక్కడి నుంచి లంబసింగికి 30 కిలోమీటర్లు. ఇక్కడి నుంచి అటవీమార్గంలో ఘాట్ రోడ్డు ప్రయాణంలో దారి పొడవునా ఎన్నో ముగ్ధమనోహరమైన దృశ్యాలు, లోయలు, జలపాతాలు కనువిందు చేస్తాయి.
లంబంసింగిలో టూరిస్టు స్పాట్(Lambasingi Tourist Spots)లు ఇవే..
తాజంగి జలాశయం
లంబసింగి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాజంగి జలాశయానికి వెళ్లేటప్పుడు కనిపించే గిరిజన గుడిసెలు, రోడ్డుకు రెండు వైపులా విరగబూసిన వృక్షాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఇక ఈ జలాశయంలో విహరించేందుకు బోటింగ్ సదుపాయం కూడా ఉంది.
వలిసె పూతోట
లంబసింగిలో పసుపు వర్ణంలో పరుచుకున్న వలిసె పూల తోటలు స్పెషల్ అట్రాక్షన్.
కొత్తపల్లి వాటర్ ఫాల్స్
లంబసింగి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తపల్లి జలపాతం వద్ద టూరిస్టులు జాలీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ట్రెక్కింగ్, స్విమ్మింగ్ వంటి అడ్వెంచర్స్ కూడా ట్రై చేయొచ్చు.
చెరువుల వేనం
‘చెరువుల వేనం(Cheruvula Venam)’ చేరుకోవాలంటే లంబసింగి నుంచి సుమారు గంట సేపు ట్రెక్కింగ్ చేయాలి. ఆకాశం నేలకు దిగిందా అనే రీతిలో కళ్లముందు మబ్బులు కనిపిస్తాయి. ఇక ఇక్కడి పచ్చని అడవులు, కొండలను తాకుతూ పయనించే పాలమబ్బులు టూరిస్టులను మైమరిపిస్తాయి. ఈ మనోహర దృశ్యం చూడాలంటే ఉదయం 10 గంటల ముందే వెళ్లాలి.
బొంగులో చికెన్
ఇక లంబసింగిలో దొరికే బొంగులో బిర్యానీ(Bongulo Chicken)ని ఇక్కడికి వెళ్లే ప్రతివారు కచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే. బొంగులో నుంచి పొగలు కక్కుతూ బయటికొచ్చే బిర్యానీ తింటే ఆహా ఏమి రుచి.. తినరా మైమరిచి అనాల్సిందే.