
తెలంగాణ (Telangana)లో స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) జోరు అందుకున్నాయి. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. తాజాగా బీసీ రిజర్వేషన్ల (BC Reservations)ను 42 శాతానికి పెంచుతూ రాష్ట్ర మంత్రివర్గం ఆర్డినెన్స్ జారీకి నిర్ణయించడంతో ఎన్నికల ప్రక్రియకు మార్గం ఈజీ అయింది. ఇక ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు (Panchayat Elections)నిర్వహించాలా? లేక MPTC, ZPTC ఎన్నికలు నిర్వహించాలా? అని ఆలోచించి చివరకు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ..
BCలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా జరిగిన సమావేశంలో క్యాబినేట్ (Cabinet)ఈ తీర్మానాన్ని ఆమోదించింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మొత్తం రిజర్వేషన్లు 50%కి మించకుండా ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. కొత్త పంచాయితీ రాజ్ చట్టం (Panchayat Raj Act) ప్రకారం గ్రామ పంచాయితీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు, అలాగే మండల మరిషత్లలో ఎంపీటీసీ స్థానాలకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి.
సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు..
తాజా ఆర్డినెన్స్ (Ordinance) ఆధారంగా త్వరలో పంచాయితీ రాజ్ శాఖ రిజర్వేషన్లపై ఉత్తర్వులు జారీ చేయనుంది. దీని తర్వాతే పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు జరుగుతాయి. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇక సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు, పోలింగ్ కేంద్రాలను కూడా ఎంపిక చేయనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,777 గ్రామ పంచాయతీలు, 5,982 మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు, 585 ZPTC స్థానాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఏం నిర్ణయించింది అంటే ముందుగా జెడ్పిటీసీ, ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలను చూస్తోంది.