దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన దేశ రాజధాని హస్తిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Delhi Assembly Election Results 2025) ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాల సరళి కన్పిస్తోంది. ఆధిక్యాల్లో బీజేపీ (BJP) మ్యాజిక్ ఫిగర్‌ను దాటి దూకుడు ప్రదర్శిస్తోంది. ఉదయం 11 గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం బీజేపీ పార్టీ 43 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక ఆప్ (AAP) 27 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
27 ఏళ్ల తర్వాత కమల వికాసం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం దిశగా దూసుకెళ్తుండటంతో పార్టీ కార్యాలయం ఎదుట కార్యకర్తలు (BJP Activists), అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. డప్పులు వాయిస్తూ డ్యాన్సులు చేస్తున్నారు. ఈసారి ఢిల్లీ కోటపై కాషాయ జెండా ఎగురవేస్తుందంటూ నినాదాలు చేస్తున్నారు. 27 ఏళ్ల తర్వాత రాజధానిలో బీజేపీ ఆధిపత్యం రాబోతోందంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మిఠాయిలు పంచుతూ సంబురాల్లో మునిగిపోతున్నారు.
చీపురుతో ఊడ్చేశారు
మరోవైపు ఢిల్లీలో బీజేపీ విజయపథం వైపు వెళ్తుండటంతో ఇతర రాష్ట్రాల్లో కీలక నేతలు స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాట్లాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay).. ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీ ప్రజలు చీపురుతో ఊడ్చేశారని అన్నారు. ఇక తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ఢిల్లీ ప్రజలు ప్రజాస్వామ్య పాలన కోరుకున్నారని.. దేశ రాజధానిలో బీజేపీ జెండా ఎగురుతుందని ముందు నుంచి ఊహించిందేనని తెలిపారు.






