ఢిల్లీ ఎన్నికల్లో(Delhi Assembly Election Results 2025) కాంగ్రెస్ పార్టీ చతికిలపడింది. ఒక్క స్థానంలో కూడా ఈ పార్టీ ఆధిక్యంలో లేదు. అన్ని చోట్ల మూడో స్థానానికే పరిమితమైంది. 2013 వరకు వరుసగా 15 సంవత్సరాలు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ పార్టీ (), గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ చతికిల పడింది. కనీసం ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది. ఈసారైనా అధికారంలోకి రావాలని భావించినా.. ఆ దిశగా ఫలితాలు మాత్రం కనిపించడం లేదు. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగా ఈసారి కూడా హస్తం పార్టీ సున్నాతోనే సరిపెట్టుకునేలా కనిపిస్తోంది.
పంతం నెగ్గించుకుంటున్న బీజేపీ
ఇక పాలనాపరమైన ఘనతలు, సంక్షేమ పథకాలపై ఆధారపడి మూడోసారి వరుసగా అధికారంలోకి రావాలని ప్రయత్నించిన ఆప్ వ్యూహాలు పెద్దగా ఫలించినట్లుగా ప్రస్తుత ఫలితాలు చూస్తే అనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాల సరళి కన్పిస్తోంది. ఆధిక్యాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌ను దాటి జోరు ప్రదర్శిస్తోంది. 27 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఢిల్లీ గడ్డపై జయకేతనం ఎగురవేయాలనే పట్టుదలతో సాగిన బీజేపీ తన పంతం నెగ్గించుకున్నట్లుగానే ఉంది.
ముందంజలో బీజేపీ..
ప్రస్తుతం బీజేపీ 42 స్థానాల్లో ముందంజలో ఉంది. ఆప్ (AAP) 28 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ తొలుత ఒక చోట ముందంజలో ఉన్నట్లే కన్పించినా.. ఆ తర్వాత వెనుకంజలోకి పడిపోయింది. ఏ స్థానంలోనూ హస్తం పార్టీ ప్రభావం చూపలేకపోతోంది. . 70 స్థానాలున్న ఢిల్లీలో 36 స్థానాలు సాధించిన పార్టీ అధికారం చేపడుతుంది.






