దిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ (Delhi Election Results 2025) కొనసాగుతోంది. మొదటి నుంచి బీజేపీ ఆధిక్యాన్ని కనబరుస్తోంది. 70 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఈనెల 5న జరిగిన ఎన్నికల ఓట్లను ఇవాళ (ఫిబ్రవరి 8వ తేదీ) లెక్కిస్తున్నారు. ఇందుకోసం 19 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అయింది. 70 స్థానాలున్న దిల్లీలో 36 స్థానాలు సాధించిన పార్టీ అధికారం చేపడుతుంది.
దిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోదియా ఆధిక్యంలోకి వచ్చారు. జంగ్‌పురలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆప్ అభ్యర్థులు సోమ్‌నాథ్ భారతి మాల్వియా నగర్‌లో, సౌరభ్ భరద్వాజ్ గ్రేట్ కైలాశ్‌లో, గోపాల్ రాయ్ బాబర్‌పుర్‌లో ముందంజలో ఉన్నారు.
46 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుండటంతో ఇక దేశ రాజధాని దిల్లీలో 27 ఏళ్ల తరువాత బీజేపీ అధికారంలోకి రాబోతుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అధికారానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 36 సీట్లను దాటింది. అధికారం కోసం కమలనాథులు చేసిన ప్రయత్నాలు ఫలించినట్టే ఈ ఫలితాలు చూస్తే కనిపిస్తున్నాయి. దీంతో బీజేపీ కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు.






