బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కేసరి చాప్టర్ 2’. అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలాబాగ్ (Kesari Chapter 2: The Untold Story of Jallianwala Bagh) అనేది ట్యాగ్‌లైన్. మాధవన్, అనన్యపాండే కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రం ఇవాళ (ఏప్రిల్ 18వ తేదీ 2025) థియేటర్లలో విడుదల అయింది. ఈ నేపథ్యంలో నటుడు అక్షయ్ కుమార్ ప్రేక్షకులను ఉద్దేశించి ఓ స్వీట్ మెసేజ్ పంపారు. ఈ సినిమా గురించి చెబుతూ వారికి ఓ స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే..?
అది అస్సలు మిస్ కావొద్దు
‘‘కేసరి చాప్టర్ 2 (Kesari Chapter 2 Release) సినిమా చూడాలని వచ్చే వారంతా ఈ మూవీ ప్రారంభాన్ని అసలు మిస్ కావొద్దు. మొదటి 10 నిమిషాలు ఈ చిత్రానికి చాలా ఇంపార్టెంట్. థియేటర్‌కు ఎవరూ ఆలస్యంగా రావొద్దు. అలా చేస్తే మీరు ముఖ్యమైన సీన్లు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక థియేటర్కు వచ్చిన తర్వాత మీరంతా మీ సెల్‌ఫోన్లను ఆఫ్ చేయండి. ఇందులోని ప్రతి డైలాగును శ్రద్ధగా వినాలని నేను కోరుతున్నాను. ఇక ఈ సినిమా చూస్తున్న సమయంలో మీరు ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ఓపెన్ చేస్తే ఈ మూవీని మీరు అవమానించినట్లే. ఈ సినిమా చూస్తున్నప్పుడు సోషల్ మీడియాకు దూరంగా ఉండండి.’’అని అక్షయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
కింగ్ ఛార్లెస్ ఈ సినిమా చూడాలి
‘కేసరి చాప్టర్ 2’ విషయానికొస్తే.. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రానికి కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా స్క్రీనింగ్ ఢిల్లీలో జరిగింది. ఈ చిత్రాన్ని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా (Delhi CM Rekha Gupta) వీక్షించారు. అయితే సినిమా చూసేటప్పుడు ఆమె చాలా ఎమోషనల్ అయ్యారు. జలియన్ వాలాబాగ్ ఉదంతాన్ని చూసి ఆమె కంటతడి పెట్టారు. మరోవైపు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని బ్రిటిష్ ప్రభుత్వం కచ్చితంగా చూడాలని అన్నారు. ముఖ్యంగా కింగ్ చార్లెస్ (Britain King Charles) ఈ మూవీ చూసి వారి తప్పును తెలుసుకోవాలని కోరారు.






