
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) తాను బాలీవుడ్ ను వీడుతున్నట్లు కొంత కాలం క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. హిందీ సినిమా ఇండస్ట్రీ ఎంతో విషపూరితంగా మారిందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. అందుకే తాను సౌత్ ఇండస్ట్రీకి వెళ్లిపోతున్నట్లు చెప్పారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను త్వరలో ముంబయి వదిలి వెళ్లిపోతానని చెప్పిన అనురాగ్ తాజాగా అక్కడి నుంచి బెంగళూరుకు షిఫ్ట్ అయ్యారు.
డెకాయిట్ లో అనురాగ్
ఇక తాను చెప్పినట్లుగానే అనురాగ్ కశ్యపై హిందీ పరిశ్రమను వీడి బెంగళూరుకు వచ్చారు. ఆయన తాజాగా తెలుగు సినిమాలో నటిస్తున్నట్లు కూడా ప్రకటించారు. అడివి శేష్ (Adivi Sesh) హీరోగా షానీల్ డియో దర్శకత్వంలో వస్తున్న ‘డకాయిట్ (Dacoit)’ సినిమాలో అనురాగ్ పోలీసు ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే అనురాగ్ తమిళంలో అంజలి సీబీఐ, మహారాజా వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు పూర్తిగా ఆయన సౌత్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టనున్నట్లు చెప్పారు.
బాలీవుడ్ దారుణం
‘‘బాలీవుడ్ పరిశ్రమ (Bollywood) చాలా దారుణంగా తయారైంది. రూ.500 కోట్లు, రూ.1000 కోట్లు వచ్చే చిత్రాలు మాత్రమే తీయాలనుకుంటున్నారు. టాలెంట్, కొత్తదనానికి ఇక్కడ అవకాశం లేకుండా పోతోంది. హిందీ చిత్ర పరిశ్రమను చూస్తుంటే అసహ్యం వేస్తోంది. ఇక్కడ నేను కొత్త సినిమాలు తెరకెక్కించలేను. ఎందుకంటే నిర్మాతలకు లాభాలు రావని వారు భావిస్తున్నారు. అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అనుకుంటున్నాను. ఉత్సాహవంతమైన వాతావరణం కోసం నేను సౌత్ ఇండస్ట్రీకి వెళ్లిపోతాను’’ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన అనురాగ్ తాజాగా సౌత్ కు వచ్చారు.