Mana Enadu : ఇజ్రాయెల్-హమాస్ (Israel Hamas), హెజ్బొల్లా, ఇరాన్ ల మధ్య యుద్ధాలతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. హమాస్ ను అంతమొందించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడుతున్న వేళ ఐడీఎఫ్ కు భారీ షాక్ తగిలింది. తాజాగా ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటిపై శనివారం రోజున బాంబుల దాడి (Bomb Attack) జరిగింది.
నెతన్యాహు ఇంటిపై బాంబుల దాడి
సిజేరియా పట్టణంలోని నెతన్యాహు (Netanyahu Residence) ఇంటి ఆవరణలోని గార్డెన్‌లో రెండు బాంబులు పడ్డాయి. అయితే దాడి సమయంలో నెతన్యాహు గానీ ఆయన కుటుంబ సభ్యులు గానీ ఇంట్లో లేనట్లు సమాచారం. ఈ క్రమంలో నెతన్యాహుకు ప్రమాదం తప్పినట్లు తెలిసింది.
గతంలోనూ డ్రోన్ దాడులు
ఈ బాంబు దాడులపై ఇజ్రాయెల్ ప్రభుత్వం స్పందిస్తూ.. వీటిని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. ఇది ఇరాన్ (Iran) పనేనంటూ ఆరోపించింది. హద్దులను దాటుతున్నారంటూ .. ఈ దాడిపై న్యాయశాఖ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని టెల్‌అవీవ్ రక్షణ మంత్రి కాట్జ్ కోరారు. కాగా.. గత నెలలో కూడా నెతన్యాహు ఇంటిపై డ్రోన్ దాడులు జరిగిన విషయం తెలిసిందే.
గాజాపై ఇజ్రాయెల్ దాడి
మరోవైపు ఉత్తర గాజా(Gaza)లోని శరణార్థుల శిబిరంపై ఇటీవల ఇజ్రాయెల్ దాడికి తెగబడింది. ఈ దాడిలో 17 మంది చనిపోయారు. మృతుల్లో 9మంది మహిళలు ఉన్నారు. గత కొద్దిరోజులుగా జబాలియా, దాని పరిసర టౌన్లు అయిన బీయిట్ లాహియా, బీయిట్ హనోన్ను ఇజ్రాయెల్ సైన్యం చుట్టుముట్టి.. మానవతా సయాహాన్ని మాత్రమే అనుమతించింది.
హెజ్‌బొల్లాతో ఇజ్రాయెల్ పోరు
ఇంకోవైపు లెబనాన్ మిలిటెంట్ గ్రూపు హెజ్‌బొల్లా(hezbollah)తో పోరు ఆపేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో కొంత పురోగతి సాధించినట్లు ఇటీవల ఇజ్రాయెల్ నూతన విదేశాంగ మంత్రి గిడియోన్ సార్ తెలిపారు. ఈ విషయంలో తాము అమెరికన్లతో కలిసి పనిచేస్తున్నామన్నారు. మిలిటెంట్ గ్రూపు అధికార ప్రతినిధి మాత్రం ఇందుకు సంబంధించి తమకు అధికారికంగా ఎలాంటి ప్రతిపాదన అందలేదని ఆయన పేర్కొన్నారు. ఒప్పందాన్ని అవతలి పక్షం ఉల్లంఘిస్తే సైనికంగా స్పందించడానికి ఇజ్రాయెల్ వెనకాడబోదని హెచ్చరించారు.






