Mana Enadu : బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్-3 (King Charles 3), ఆయన సతీమణి క్వీన్ కెమిల్లా భారత్‌లో రహస్యంగా పర్యటిస్తున్నట్లు సమాచారం. మూడ్రోజుల పర్యటన నిమిత్తం వారు ఇండియాకు వచ్చినట్లు తెలిసింది. అక్టోబర్ 27వ తేదీ నుంచి వారు కర్ణాటకలోని బెంగళూరులో ఉన్నట్లుగా పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
బెంగళూరులో కింగ్ ఛార్లెస్-3
ఓ వెల్‌నెస్ (Bengaluru Wellness Center) కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నట్లు పలు మీడియా తెలిపాయి. అయితే వారు బుధవారమే బెంగళూరు నుంచి బ్రిటన్‌కు బయలుదేరనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బ్రిటన్ రాజదంపతులు వెల్‌నెస్ కేంద్రంలో యోగా, మెడిటేషన్ సాధనలో సమయం గడుపుతున్నట్లు తెలిపాయి.
వెల్‌నెస్ సెంటర్‌లో చికిత్స
మీడియా కథనాల ప్రకారం కింగ్ చార్లెస్-3 దంపతులు అక్టోబర్ 21- 26 మధ్య కామన్వెల్త్ ప్రభుత్వాధినేతల సమావేశానికి హాజరై.. ఆ తర్వాత సమోవా నుంచి నేరుగా భారత్(King Charles 3 India Visit)కు రహస్యంగా వచ్చారు. సీక్రెట్ ట్రిప్ కావడం వల్ల ప్రభుత్వం ఎలాంటి అధికారిక ఆహ్వాన కార్యక్రమాలు నిర్వహించలేదని మీడియా కథనాలు పేర్కొన్నారు. బెంగళూరులోని వెల్‌నెస్ సెంటర్‌లో ప్రత్యేక సిబ్బంది వారికి వివిధ థెరపీ సెషన్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపాయి.
బ్రిటన్ రాజుగా భారత్ లో తొలి పర్యటన
2022లో క్వీన్ ఎలిజబెత్ II మరణించిన తర్వాత ఛార్లెస్‌ను బ్రిటన్‌కు రాజు అయ్యారు. ఆయన రాజుగా అధికారికంగా బాధ్యతలు చేపట్టాక భారత్ లో పర్యటించడం ఇదే తొలిసారి. అయితే ఆయన వేల్స్ యువరాజుగా ఉన్న సమయంలో చాలా సార్లు బెంగళూరులో పర్యటించారు. ఇక్కడి వెల్‌నెస్ సెంటర్‌కు వచ్చేవారు. తన 71వ పుట్టిన రోజును కూడా ఆయన ఇక్కడే ఘనంగా జరుపుకున్నారు.