Mana Enadu : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతల అరెస్టులను ఖండిస్తూ ఆ పార్టీ (BRS) నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపేందుకు నేతలు సిద్ధమైన క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతల నివాసాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
హరీశ్, కవిత హౌస్ అరెస్టు
కోకాపేటలోని హరీశ్‌రావు (Harish Rao House Arrest) ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు.. ఆయన ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా గృహనిర్బంధం చేశారు. అయితే ఇవాళ రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ వర్దంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించడానికి కూడా వెళ్లనీయడం లేదని హరీశ్ రావు పోలీసులపై మండిపడ్డారు. ఈ క్రమంలో వారితో వాగ్వాదానికి దిగారు. మరోవైపు ఈరోజు ఉదయం నుంచే ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఇంటికి పోలీసులు చేరుకుని ఆమెను హౌస్ అరెస్టు చేశారు.
ఎమ్మెల్సీ కవిత హౌస్ అరెస్ట్
కవిత ఇంటి ముందు మోహరించిన పోలీసులు https://t.co/ZVWITSdRqA pic.twitter.com/PsCTLe85i0
— Telugu Scribe (@TeluguScribe) December 6, 2024
కౌశిక్, వివేకానంద గృహనిర్బంధం
కొంపల్లిలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద (MLA Vivekananda), కూకట్‌పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును గృహ నిర్బంధం చేసిన పోలీసులు.. మేడ్చల్ జిల్లా దుండిగల్ మండలంలోని నివాసంలో ఆ పార్టీ నేత శంభీపూర్ రాజు, కొండాపూర్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (Padi Kaushik Reddy), కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, రాజేంద్రనగర్ బండ్లగూడలో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను హౌస్ అరెస్టు చేశారు. మరోవైపు తెలంగాణ భవన్ వద్ద పోలీసులు మోహరించారు.
ఎక్కడికక్కడ గులాబీ నేతల నిర్బంధం
గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, నేతల అక్రమల అరెస్టులకు నిరసనగా ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ ధర్నా (BRS Dharna) నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు ఎక్కడికక్కడ ప్రతిఘటిస్తున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఈ నిర్బంధం ఏంటని నిలదీస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి నిర్బంధాలు సరికాదంటూ ధ్వజమెత్తుతున్నారు.
వారిని వెంటనే విడుదల చేయాలి
రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు, నిర్బంధాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు వెళ్ళనివ్వకుండా ఈ నిర్బంధాలు ఎందుకు?
ఇది నీ నిరంకుశ, నియంతృత్వ పాలనకు… pic.twitter.com/GBDaSiTwnw
— Harish Rao Thanneeru (@BRSHarish) December 6, 2024
రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు, నిర్బంధాలు చేయడాన్ని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) తీవ్రంగా ఖండించారు. ఒకవైపు ప్రజా పాలన విజయోత్సవాలు అని ప్రచారం చేసుకుంటూ, మరోవైపు రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని ప్రకటించారని ప్రభుత్వంపై మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ అప్రజాస్వామిక విధానాలు, రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వైఖరిని చూసి హైదరాబాద్ నడిగడ్డపై ఉన్న అంబేడ్కర్ సైతం నివ్వెరపోతున్నారని ట్వీట్ చేశారు. అదుపులోకి తీసుకున్న తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.