
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు (Telangana MLC Elections 2025) నగారా మోగిన విషయం తెలిసిందే. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పదవీ కాలం మార్చి 29వ తేదీతో ముగియడంతో వాటికి ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎలక్షన్స్ లో భారత్ రాష్ట్ర సమితి బరిలోకి దిగుతుందా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల పోరుకు గులాబీ పార్టీ (BRS Party) దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఎన్నికలకు దూరంగా
తెలంగాణలో రెండు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ పోరుకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ (BRS MLC Elections) నిర్ణయించినట్లు తెలిసింది. తమ పార్టీ తరఫున అభ్యర్థులను ప్రకటించకూడదని నిర్ణయించినట్లు సమాచారం. అంతే గాకుండా.. ఎవరికీ మద్దతు ఇవ్వకూడదనే నిర్ణయానికొచ్చినట్లు తెలిసింది.
ఎవరికీ మద్దతివ్వొద్దు
ఇటీవల గులాబీ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR)తో.. కేటీఆర్, హరీశ్ రావు (Harish Rao) సహా ఇతర ముఖ్యనేతలు సమావేశం కాగా.. ఈ భేటీలో ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పష్టమైన సంకేతాలు అందినట్లు సమాచారం. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పలువురు పార్టీ నేతల పేర్లు పరిశీలనకు వచ్చినా, ఎవరినీ పోటీలోకి దించొద్దని, ఎవ్వరికీ మద్దతు కూడా ఇవ్వవద్దని కేసీఆర్ స్పష్టం చేసినట్లు సమాచారం.