Mana Enadu : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) బుధవారం రోజున హైకోర్టును ఆశ్రయించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని కోరుతూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం(Telangana HC)లో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. తన ఫోన్లను ట్యాప్ చేయించారని సిద్దిపేటకు చెందిన స్థిరాస్తి వ్యాపారి, కాంగ్రెస్ నేత గదగోని చక్రధర్‌గౌడ్ పంజాగుట్ట పీఎస్ లో ఫిర్యాదు ఇచ్చిన విషయం తెలిసిందే.
హైకోర్టుకు హరీశ్ రావు
చక్రధర్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు ఆదివారం రోజున.. బీఆర్ఎస్ నేత హరీశ్ రావు, విశ్రాంత పోలీసు అధికారి రాధాకిషన్‌రావుపై 120(బీ), 386, 409, 506 ఆర్/డబ్ల్యూ 34ఐపీసీ, 66 ఐటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే హరీశ్ రావు తాజాగా హైకోర్టు (High Court)ను ఆశ్రయించారు. ఈ కేసును క్వాాష్ చేయాలని ఉన్నత న్యాయస్థానాన్ని ఆయన కోరారు.
హరీశ్ పై ఫోన్ ట్యాపింగ్ ఫిర్యాదు
కాగా.. ఎన్నికల సమయంలో హరీశ్ రావు తన ఫోన్‌తోపాటు కుటుంబ సభ్యులకు చెందిన 20 ఫోన్లను ప్రణీత్‌రావు సాయంతో ట్యాప్ (Phone Tapping) చేశారని చక్రధర్‌గౌడ్ తన ఫిర్యాదులో ఆరోపించారు. తాను అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఈ విషయంలో న్యాయస్థానంలో రిట్ పిటిషన్ వేయగా… కోర్టు ఆదేశాలతోనే పోలీసులు కేసు నమోదు చేశారని అన్నారు.
సంచలనం రేకెత్తించిన ట్యాపింగ్
అయితే గత కొంతకాలంగా రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెను సంచలనం రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వ (BRS Govt) హయాంలో పలువురు కీలక నేతలు.. పోలీసు ఉన్నతాధికారులతో అధికార, ప్రతిపక్ష నేతలు, ఉన్నతాధికారులు, జడ్జిలు, చివరకు హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సర్కార్ పటిష్ఠ విచారణ కూడా జరిపిస్తున్న విషయం తెలిసిందే.