ManaEnadu : కోల్‌కతా ఆర్జీ కార్ ఆస్పత్రి (RG Kar Hospital)లో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనలో సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ క్రమంలో తాజాగా కోల్‌కతా పోలీసులపై వారు కీలక ఆరోపణలు చేశారు. ఈ కేసులో నిందితుడైన సంజయ్ రాయ్‌కు సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకోవడంలో కోల్ కతా పోలీసులు (Kolkata Police) తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. హత్యాచారంలో నిందితుడి ప్రమేయం ఉందని తెలిసినా అతడికి సంబంధించిన దుస్తులను ఘటన జరిగిన 2 రోజుల తర్వాత సీజ్ చేశారని, ఫలితంగా ఆధారాల సేకరణ కష్టంగా మారిందని వెల్లడించారు.
వాళ్లకు నిందితుడితో సంబంధాలు!
“ఘటన (Kolkata Doctor Rape Murder) జరిగిన రోజే దుస్తులు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకొని ఉంటే బలమైన సాక్ష్యాధారాలు దొరికే అవకాశం ఉండేది. అలా చేసుంటే కేసులో కొంత వరకు పురోగతి కనిపించేది. ఆర్జీ కార్ వైద్యకళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తాలా పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ అభిజిత్ మోండల్‌లు సాక్ష్యాలను చెరిపివేసేందుకు ప్రయత్నించారు. సందీప్ ఘోష్, అభిజిత్ మోండల్‌లకు నిందితుడితో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో విచారిస్తున్నాం. తాలా పోలీసు స్టేషన్, నేరం జరిగిన ప్రదేశం, ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నాం.
హడావుడిగా అంత్యక్రియలు
నిందితుడికి, ఈ ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ జరిగిందా అనే కోణంలోనూ విచారణ జరుగుతోంది. బాధితురాలి మృతదేహానికి శవపరీక్ష పూర్తి అవ్వగానే తాలా పోలీసు స్టేషన్ (Tala Police Stations) ఎస్‌హెచ్‌ఓ అభిజిత్ మోండల్ హడావుడిగా అంత్యక్రియలు జరిపించారు. మరోసారి శవపరీక్ష నిర్వహించాలని బాధితురాలి తల్లిదండ్రులు కోరినా పట్టించుకోలేదు.” అని సీబీఐ (CBI) అధికారులు ఆరోపణలు చేశారు. తొలుత ఈ కేసును బంగాల్ పోలీసులు దర్యాప్తు చేయగా.. విచారణపై అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో కలకత్తా హైకోర్టు ఆ కేసును సీబీఐకి బదిలీ చేసిన విషయం తెలిసిందే.