
ఆపరేషన్ సింధూర్ తర్వాత పార్లమెంట్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశం నిర్వహించడానికి కేంద్రం అనాసక్తి చూపుతున్నట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి. రాబోయే జూలై నెలలో నిర్వహించే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే ఆపరేషన్ సింధూర్ కు (Operation Sindhur) సంబంధించిన విషయాలు చెప్పేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
నాలుగు రోజుల తర్వాత..
పహల్గాం దాడి (Pahalgam attack) తర్వాత భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో భారత్ పాక్ పై ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ సమయంలో కేంద్రం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయగా.. అన్ని పార్టీలు పాక్ పై కేంద్రం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. నాలుగు రోజుల తర్వాత ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకారం తెలిపాయి.
విపక్షాల డిమాండ్
అయితే దాడి అనంతరం జరిగిన పరిణామాలపై పార్లమెంట్ ను ప్రత్యేకంగా సమావేశపరిచి వివరాలు చెప్పాలని రాహుల్ గాంధీ (Rahul Gandhi) కేంద్రానికి లేఖ రాశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం పెద్దగా సుముఖత చూపడం లేదు. ఆపరేషన్ సింధూర్ కేవలం తాత్కాలికంగానే ఆగినట్లు చెబుతున్నారు. విపక్షాలు చేస్తున్న డిమాండ్ లను బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల కారణంగా ఆపరేషన్ సింధూర్ గురించి ప్రత్యేకంగా సమావేశం కావాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు పేర్కొంటున్నారు. ఇప్పటికే పాక్ లోని 11 ఎయిర్ బేస్ లను ఇండియా కుప్పకూల్చింది. ఆదంపూర్ ఎయిర్ బేస్ వద్ద ప్రధాని మోదీ దేశం గురించి మాట్లాడుతూ.. దేశ రక్షణ విషయంలో ఎలాంటి రాజీ పడాల్సిన అవసరం లేదని.. న్యూక్లియర్ విషయంలో బెదిరింపులకు భయపడబోమని వెల్లడించారు. పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు కేంద్రం సుముఖంగా లేకపోవడంతో కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.