ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ (Corona Virus) భయం నుంచి ఇప్పటికీ కోలుకోకముందే మరో మహమ్మారి ఇప్పుడు కలకలం రేపుతోంది. చైనాలో మరో కొత్త వైరస్ హెచ్ఎంపీవీ (HMPV) వ్యాప్తి చెందుతున్న వార్తలు ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. అయితే దీని వ్యాప్తి కట్టడిలోనే ఉందని, భయపడాల్సిన అవసరం లేదని చైనా ప్రకటన చేసినా.. ప్రపంచ దేశాలు మాత్రం భయంతో వణుకుతున్నాయి.
బెంగళూరులో HMPV తొలి కేసు
ఇక భయపడినట్లుగానే కొత్త వైరస్ భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. చైనా హెచ్ఎంపీవీ వైరస్ (HMPV India) తొలి కేసును భారత్ లో గుర్తించినట్లు తెలిసింది. బెంగళూరులో (HMPV First Case in Bengaluru) ఎనిమిది నెలల చిన్నారిలో ఈ వైరస్ పాజిటివ్ గా తేలినట్లు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. దీనిపై కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. రాష్ట్రంలోని ల్యాబ్ లో ఈ పరీక్ష నిర్వహించలేదని వెల్లడించింది. ఈ రిపోర్టు ఓ ప్రైవేట్ ఆస్పత్రి నుంచి వచ్చిందని.. దానిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేసింది.
మాస్క్ మస్ట్ గురూ
చైనాను వణికించిన వైరస్ మనవరకూ ఎందుకు వస్తుందిలే అనుకున్న భారతీయులకు తాజాగా షాక్ తగిలింది. బెంగళూరులో ఈ వైరస్ తొలి కేసు వెలుగులోకి రావడంతో ఇప్పుడు భయాందోళనలు నెలకొన్నాయి. కరోనా వంటి లక్షణాలతో ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం వచ్చేసిందని పలువురు నిపుణులు అంటున్నారు. ఇప్పటికైనా మాస్కులు (Masks) ధరించి, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచిస్తున్నారు. చేతులు ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకుంటూ జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.






