Mana Enadu : వర్షాకాలంలో వరదల ధాటికి రాష్ట్రంలో చాలా ప్రాంతాలు నీటమునిగిన విషయం తెలిసిందే. ప్రతి ఏటా ఇదే రిపీట్ అవుతోంది. అప్రమత్త చర్యలు తీసుకున్నా జలదిగ్బంధాన్ని రాష్ట్ర ప్రభుత్వం అరికట్టలేకపోతోంది. ఈ నేపథ్యంలో వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ (NDRF) దళాన్ని రంగంలోకి దించాల్సి వస్తోంది. అయితే ఇలాంటి విపత్తు సమయంలో సొంతంగా దళాన్ని రెడీ చేసుకోవాలని భావించింది తెలంగాణ సర్కార్. ఆ దిశగా చర్యలు కూడా చేపట్టింది.
2వేల మందితో ఎస్‌డీఆర్‌ఎఫ్
ఈ నేపథ్యంలోనే ఎన్‌డీఆర్ఎఫ్ తరహాలో సుశిక్షుతులైన రాష్ట్ర దళాన్ని ఎస్‌డీఆర్‌ఎఫ్ (Telangana state disaster response forceను తీర్చిదిద్దింది. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం(SDRF)ను ఇవాళ (డిసెంబరు 6న) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో దాదాపు 2వేల మంది సిబ్బందితో ఎస్‌డీఆర్‌ఎఫ్ ఏర్పాటైంది. భారీ అగ్ని ప్రమాదాలు, భూకంపం, వరదలు వంటి విపత్తులు సంభవించినప్పుడు అత్యవసరంగా ఈ దళం సహాయక చర్యలు చేపడుతుందని సీఎం రేవంత్ (CM Revanth Reddy) తెలిపారు.
రూ.35 కోట్లతో అధునాతన పరికరాలు
అగ్నిమాపక కేంద్రాలు ఇక నుంచి ఎస్‌డీఆర్‌ఎఫ్ స్టేషన్లుగా మార్పు చెందనున్నట్లు సీఎం వెల్లడించారు. రూ.35.03 కోట్ల నిధులతో అధునాతన పరికరాలు, కొత్త అగ్నిమాపక వాహనాలు కొనుగోలు చేసి సిబ్బందికి ఎస్‌డీఆర్‌ఎఫ్ ప్రాథమిక కోర్సుల్లో శిక్షణ ఇప్పించినట్లు చెప్పారు. అగ్నిమాపక శాఖ (Fire Department)కు చెందిన వెయ్యి మందికి తమిళనాడులోని అరక్కోణం, మహారాష్ట్రలోని పుణే, గుజరాత్‌లోని వడోదరా, ఏపీలోని కృష్ణాజిల్లాలో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ కేంద్రాల్లో శిక్షణ ఇప్పించినట్లు వివరించారు.
ఎస్‌డీఆర్‌ఎఫ్ అమ్ముల పొదిలో ఏమున్నాయంటే?
ఎస్‌డీఆర్‌ఎఫ్ (SDRF Kits) వద్ద కొత్తగా 20 బస్సులు, ట్రక్కులు, బొలేరోలతో పాటు 40 వాటర్ బోట్‌లు ఉన్నాయి. అగ్నిప్రమాదాల్లో సహాయ చర్యల కోసం సిబ్బందికి హెల్మెట్లు, చేతి గ్లౌజ్‌లు, కంటి అద్దాలు, రెఫ్లెక్టివ్ టేప్‌లు, సేఫ్టీషూ, మెడికల్ ఫస్ట్ రెస్పాండర్ కిట్‌లు.. వరదనీటిలో సహాయ చర్యల కోసం సిబ్బంది ధరించేందుకు వాటర్ ప్రూఫ్ జాకెట్లు, ట్రౌజర్లు, బెర్ముడా, డుంగారి డ్రెస్, ఎల్ఈడీ హెడ్‌లైట్‌తో కూడిన హెల్మెట్, ఫేస్ షీల్డ్, ఫేస్ మాస్క్ వంటి అధునాతన పరికరాలున్నాయి.






