Mana Enadu : తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు సుప్రీంకోర్టు (Supreme Court) షాక్ ఇచ్చింది. ఈ పరీక్షల నోటిఫికేషన్ అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరటనిస్తూ.. అభ్యర్థులకు షాక్ నిస్తూ తాజాగా తీర్పు వెల్లడించింది. గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు కుదరదని తేల్చి చెప్పింది. నోటిఫికేషన్ రద్దు, మెయిన్స్ వాయిదా వేయాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
పిటిషన్లు కొట్టివేత
గ్రూపు-1 కొత్త నోటిఫికేషన్ (Group 1 New Notification) చట్టవిరుద్ధమని, ప్రిలిమ్స్ లో 14 తప్పులున్నాయని.. కొందరు అభ్యర్థులు గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేయాలని హైకోర్టును కోరగా.. ఆ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వారు సుప్రీంకోర్టు (SC Group 1 Verdict)ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం రోజున జస్టిస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి తీర్పు వెలువరించింది.
మెయిన్స్ కు క్వాలిఫై కాలేదుగా
పిటిషనర్లు మెయిన్స్‌కు క్వాలిఫై కానందున మెయిన్స్ పరీక్ష (TG Group 1 Mains) వాయిదా వేయాల్సిన అవసరం లేదు. పరీక్షల నిర్వహణలో కోర్టుల జోక్యం అనవసరం. కోర్టుల జోక్యంతో నియామకాల్లో తీవ్ర జాప్యం జరుగుతుంది. అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ మేరకు పిటిషన్లు కొట్టివేస్తూ నోటిఫికేషన్ రద్దు, మెయిన్స్ వాయిదా కుదరదని తేల్చి చెప్పింది.
గ్రూపు-1 మెయిన్స్ కు రంగం సిద్ధం
ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ధర్మాసనం గ్రూపు-1 మెయిన్స్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే టీజీపీఎస్సీ(TGPSC) గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలోగా మెయిన్స్ ఫలితాలు విడుదల చేస్తామని టీజీపీఎస్సీ తెలిపింది. అంతే కాకుండా ఇక నుంచి అవరోహణ క్రమంలో అంటే మొదట గ్రూపు-1, గ్రూపు-2 ఆ తర్వాత గ్రూపు-3 పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల, పోస్టుల భర్తీ ప్రక్రియ చేపడతామని కీలక నిర్ణయం తీసుకుంది.






