అదానీపై విచారణ, మణిపూర్‌లో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఏఐసీసీ ఛలో రాజ్ భవన్ పిలుపు మేరకు టీపీసీసీ (TPCC) ఆధ్వర్యంలో బుధవారం ‘చలో రాజ్‌భవన్’ (Chalo Raj Bhavan) చేపట్టారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డు ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్‌భవన్ వరకు కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అండదండలతో దేశంలోని వ్యవస్థలను, బ్యాంకులను అదానీ మభ్య పెడుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీ తీశారు.
అనంతరం రాజ్‌భవన్ సమీపంలో రోడ్డుపై నేతలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై వినతిపత్రం అందించేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వకపోవటంతో.. రాజ్ భవన్‌కు 100 మీటర్ల దూరంలోనే సీఎంతోపాటు నేతలంతా కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మీడియాతో మాట్లాడుతూ.. అదానీ అంశంతో పాటు, మణిపూర్ అల్లర్లపై మోదీ ఎందుకు మౌనంగా ఉన్నాలన్నారు. భారత వ్యాపార వ్యవస్థలు అవినీతిలో కూరుకుపోయాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్లుగా దేశ ప్రతిష్ఠను పెంపొందించిందని.. కానీ అదానీ, ప్రధాని కలిసి దేశం పరువు తీశారని ఆరోపించారు. ప్రపంచ దేశాల ముందు భారత్ పరువు తాకట్టుపెట్టారని వ్యాఖ్యలు చేశారు. లంచాలతో దేశం పరువును మంటగలిపిన అదానీపై విచారణ జరగాలని. విచారణకు జేపీసీ నేతృత్వం వహించాలని డిమాండ్ చేశారు.
Live: Hon'ble CM Sri.A.Revanth Reddy participates in the Chalo Raj Bhavan Programme. https://t.co/ENErWFLgJd
— Revanth Reddy (@revanth_anumula) December 18, 2024






