Mana Enadu : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు దసరా కానుకగా డబుల్ బొనాంజా ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ సీజన్ నుంచే సన్న వడ్లకు రూ.500 బోనస్ (Rs.500 Bonus For Fine Rice) సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మరోవైపు ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆ దిశగా అధికారులు కసరత్తులు ముమ్మరం చేశారు. వీటితో పాటు దసరా కానుకగా రైతు భరోసా (rythu bharosa) డబ్బులనూ విడుదల చేసే అవకాశం ఉందని తెలిసింది.
రైతులను దగా చేసే వారిపై క్రిమినల్ కేసులు
ధాన్యం కొనుగోళ్లపై గురువారం రోజున సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ధాన్యం కొనుగోళ్లలో తాలు, తరుగు, తేమ పేరిట రైతులను మోసం చేసే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అవసరమైన చోట కొత్త ఐకేపీ కేంద్రాలు (IKP Centers) ఏర్పాటు చేయాలని .. సన్నవడ్లకు బోనస్ ఇస్తున్నందున అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 7 వేల ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
క్వింటాల్ కు రూ.500 బోనస్ అప్పట్నుంచే
ఇక రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఈ సీజన్ నుంచే సన్న వడ్లకు కనీస మద్దతు ధరకు అదనంగా ఒక్కో క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి కేంద్రానికి క్రమ సంఖ్య ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సన్న వడ్ల కొనుగోళ్ల (Paddy Procurement)కు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం చేశారు. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే తరలించాలని సూచించారు. వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా ఐకేపీ కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలని.. సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ధాన్యం కొనుగోళ్లపై పర్యవేక్షణ
“ఇక ధాన్యం కొనుగోలులో వ్యవసాయ అధికారులు భాగస్వామ్యం కావాలి. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు రోజూ రెండు గంటలు సమీక్షించాలి. ధాన్యం కొనుగోళ్ల (Paddy Purchase)పై కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో రైతులు అందరూ సన్నబియ్యం పండించేలా అధికారులు చొరవ చూపించాలి.” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.