తిరుమల లడ్డూ వివాదం.. స్వతంత్ర సిట్‌ ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఆదేశం

Mana Enadu : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం (Tirumala Laddu Controversy) తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణల అంశం దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది. ఈ మేరకు సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయిస్తోంది. అయితే ఈ వ్యవహారం సుప్రీంకోర్టు (Supreme Court)కు చేరడంతో సిట్ దర్యాప్తునకు ఇటీవల తాత్కాలిక బ్రేక్ పడింది.

స్వతంత్ర సిట్ ఏర్పాటు

ఈ నేపథ్యంలో తిరుమల లడ్డూ వ్యవహారంపై ఇవాళ (అక్టోబర్ 4వ తేదీ) సుప్రీంకోర్టు విచారణ జరిపింది.  ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్‌ (Independent SIT) ఏర్పాటు చేయాలని జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ ప్రభుత్వం (AP Govt) తరఫున ఇద్దరు పోలీసు అధికారులు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి ఒక సీనియర్‌ అధికారి సభ్యులుగా ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది. స్వతంత్ర సిట్‌ దర్యాప్తును సీబీఐ డైరెక్టర్‌ (CBI Director) పర్యవేక్షిస్తారన్న సర్వోన్నత న్యాయస్థానం.. కోట్లాది భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.

భక్తుల మనోభావాలకు చెందిన విషయం

ఇక అంతకుముందు కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్ తుషార్‌ మెహతా తన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు తెలుపుతూ..  ఇది భక్తుల మనోభావాలకు చెందిన విషయమని.. దర్యాప్తు కొనసాగాలని కోరుకుంటున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సిట్‌ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవ్న ఆయన.. స్వతంత్ర విచారణ కోరుకుంటున్నారు కాబట్టి.. సీనియర్‌ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే మరింత విశ్వాసం పెరుగుతుందని కోర్టుకు విన్నవించారు.

మరోవైపు పిటిషనర్లలో ఒకరైన YSRCP MP, TTD మాజీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తన పదవికి సంబంధించిన వివరాలు వెల్లడించకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవద్దని.. కోర్టులను రాజకీయ వేదికలుగా వినియోగించవద్దని వ్యాఖ్యానించింది.

Share post:

లేటెస్ట్