తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ (Telangana Cabinet Expansion)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పట్లో కేబినెట్ విస్తరణ లేనట్లేనన్న సంకేతాలు ఇచ్చారు. దిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా రేవంత్ మాట్లాడారు. మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలో నిర్ణయించేది అధిష్ఠానానిదేనని తెలిపారు. తాను ఎవరి పేరును సిఫార్సు చేయడం లేదని చెప్పారు. మరోవైపు ఈ ఇష్ఠాగోష్ఠిలో మరికొన్ని విషయాలపైనా రేవంత్ రెడ్డి స్పందించారు.
దానిపై రెండ్రోజుల్లో ప్రకటన
కులగణన (Caste Census) ఆషామాషీగా చేసింది కాదు. ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుని చేశాం. సర్వే ప్రకారం బీసీలు 5.30 శాతం పెరిగారు. ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం దక్కుతుంది. పీసీసీ కార్యవర్గ కూర్పుపై రెండ్రోజుల్లో ప్రకటన ఉంటుంది. ప్రభుత్వం, పార్టీ తీసుకునే అన్ని కీలక నిర్ణయాలు అధిష్ఠానం దృష్టిలో ఉంటాయి. పార్టీ, పార్టీ నేతల మనోభావాలకు అనుగుణంగానే నడుచుకుంటానే తప్ప, వ్యక్తిగత నిర్ణయాలు ఎప్పుడూ ఉండవు అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.







