Mana Enadu : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బుధవారం రోజున పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రజలపై వరాల జల్లు కురిపించారు. జిల్లాకు పలు అభివృద్ధి పనులను మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పెద్దపల్లికి రూరల్ పోలీసు స్టేషన్, మహిళా పోలీసు స్టేషన్, ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌ను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
పెదపల్లిపై రేవంత్ రెడ్డి వరాల జల్లు
అంతే కాకుండా ఎలిగేడు మండల కేంద్రానికి పోలీసు స్టేషన్, వ్యవసాయ మార్కెట్ (Peddapalli Agriculture Market)ను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిని 100 పడకలకు పెంచేందుకు అనుమతి ఇచ్చిన సీఎం రేవంత్.. మంథనిలో 50 పడకల ప్రభుత్వాసుపత్రి నిర్మాణానికి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక గుంజపడుగులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇస్తూ.. పెద్దపల్లికి 4 వరుసల బైపాస్ రోడ్ మంజూరు చేశారు ముఖ్యమంత్రి.
గ్రూపు-4 అభ్యర్థులకు నియామక పత్రాలు
మరోవైపు పెద్దపల్లి జిల్లా వేదికగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రూపు-4 అభ్యర్థులకు నియామక పత్రాలు (Group4 Appointment Orders) అందజేయనున్నారు. వివిధ శాఖల్లో గ్రూప్ 4 ఉద్యోగాలకు ఎంపికైన 8 వేల 143 మందికి కాసేపట్లో నియామక పత్రాలు ఇవ్వనున్నారు. అదేవిధంగా వైద్యారోగ్య శాఖ ఎంపిక చేసిన 442 మంది అసిస్టెంట్ సర్జన్లు, సింగరేణి ఉద్యోగాలు దక్కించుకున్న 593 మందికి కూడా నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి అందజేస్తారు.
పెదపల్లికి ఆర్టీసీ డిపో మంజూరు
అంతే కాకుండా తాజాగా రాష్ట్రంలో రెండు ఆర్టీసీ డిపోలు మంజూరయ్యాయి. అందులో ఒకటి పెద్దపల్లి (Peddapalli RTC Depot)లో ఏర్పాటు చేయనుండగా.. రెండోది ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఏర్పాటు చేయనున్నారు. కొత్త డిపోల ద్వారా ఆ ప్రాంత వాసులకు, మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రయాణికులకు మేలు జరగనుంది.






