Mana Enadu : పేదలు ఆత్మ గౌరవంతో బతకాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ సర్కార్ ఆరు గ్యారంటీల్లో భాగంగా ‘ఇందిరమ్మ ఇళ్లు’ పథకం (Indiramma Housing Scheme) ప్రవేశపెడతామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆ దిశగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రోటీ, కపడా, మకాన్ అనేది ఇందిరమ్మ నినాదమని పునరుద్ఘాటించారు. ఇల్లు, వ్యవసాయ భూమిని ఆత్మ గౌరవంగా భావిస్తారని.. అందుకే ఇందిరా గాంధీ దశాబ్దాల క్రితమే ఇళ్లు, భూ పంపిణీ పథకాలను ప్రారంభించారని వెల్లడించారు.
వారు కాస్త పెద్దగా ఇల్లు కట్టుకోవచ్చు
“రూ.10 వేలతో ప్రారంభమైన ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ ఇవాళ రూ.5 లక్షలకు చేరుకుంది. ఇంటి నిర్మాణానికి ప్రతి పేదవాడికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం (Indiramma Indlu Scheme) అందజేస్తున్నాం. అర్హులైన వారికి ప్రభుత్వ ఇల్లు చెందాలనేది మా ధ్యేయం. దేశంలో గుడి లేని ఊరు ఉండొచ్చు కానీ, ఇందిరమ్మ కాలనీ లేని ఊరు లేదు. ఆర్థిక పరిస్థితి బాగున్న వారు ఈ పథకం సాయంతో ఇల్లును కాస్త పెద్దగా కట్టుకోవచ్చు.” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
తొలిదశలో వారికే ప్రాధాన్యం
ఈ పథకంలో భాగంగా తొలి దశలో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని తెలిపిన సీఎం రేవంత్.. మొదటి దశలో ఎస్సీలు, ఎస్టీలు, ట్రాన్స్‌జెండర్లు, అత్యంత పేదలకు ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. ఇక గోండులు, ఆదివాసీలకు కోటాలతో ఎలాంటి సంబంధం లేకుండా ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఇక మొబైల్ యాప్ (Indiramma Housing Scheme App) ద్వారా శుక్రవారం నుంచి అధికారులు లబ్ధిదారులను నమోదు చేయనున్నారు. గ్రామసభల్లో ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హుల ఎంపిక చేయనున్నారు.