తెలంగాణలో ప్రస్తుతం ఫార్ములా-ఈ కారు (Hyderabad Formula E Race) రేసు వ్యవహారం కాక రేపుతోంది. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన హైకోర్టు (Telangana High Court)ను ఆశ్రయించారు. మరోవైపు ఈ వ్యవహారంపై చర్చించాలని బీఆర్ఎస్ శాసనసభలో పట్టుబట్టింది. ఆందోళనకు కూడా దిగింది. కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్ష సాధిస్తోందంటూ ఆరోపించారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందిచారు. ఫార్ములా ఈ- రేసింగ్‌పై సభలో చర్చించాలని కేటీఆర్ ఇంతకాలం ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. ఈ-కార్ రేసు ప్రతినిధులు తనను కలిసి రూ.600 కోట్ల పెండింగ్ నిధులు రావాల్సి ఉందని.. ఇవ్వమని అడిగారని తెలిపారు. ఒప్పుకుంటే మరోసారి రేసింగ్ (Formula E Race Case) నిర్వహిస్తామని చెప్పారని వెల్లడించారు. ఎఫ్‌ఈవో ప్రతినిధులు వచ్చి కలిసిన తర్వాతే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని శాసనసభలో సీఎం వివరించారు.
హెచ్‌ఎండీఏ (HMDA) ఖాతాలోని రూ.కోట్ల నిధులు లండన్‌లోని కంపెనీకి నేరుగా ఎలా వెళ్తాయి? అని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రశ్నించారు. కేటీఆర్ ఈ-రేసింగ్ (KTR E Race Case News) ప్రతినిధులతో రూ.600 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకున్నారని.. మిగతా డబ్బు కోసం వాళ్లు వచ్చినప్పుడే ఈ విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. తాను జాగ్రత్త పడటం వల్ల రూ.450 కోట్లు మిగిలాయని.. ఈ కార్ రేసింగ్ వ్యవహారంపై ఏసీబీ (KTR ACB Case) విచారణ జరుగుతోందని చెప్పారు. న్యాయపరంగా చిక్కులు లేకపోతే ఈ వ్యవహారంపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని రేవంత్ స్పష్టం చేశారు. రూ.55 కోట్లు చిన్న విషయం కాదని పేర్కొన్నారు.






