
తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద కాలం తర్వాత కొత్త రేషన్ కార్డు(New Ration Cards)ల పంపిణీకి సర్వం సిద్ధమైంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేడు (జులై 14) సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి, తుంగతుర్తి నియోజకవర్గంలో సాయంత్రం 4 గంటలకు అర్హులకు కొత్త రేషన్ కార్డులు(New ration cards distribution) అందించి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు హాజరుకానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) రాష్ట్ర వ్యాప్తంగా 2.4 నుంచి 5 లక్షల కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనుంది. దీంతో దాదాపు 11.3 నుంచి 12 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది.
కొత్తగా కార్డులు స్మార్ట్ కార్డుల రూపంలో
ఈసారి ఈ కొత్త రేషన్ కార్డులు స్మార్ట్ కార్డు(Smart Cards)లుగా రూపొందించారు. ఇందులో QR కోడ్, బయోమెట్రిక్ గుర్తింపు, లామినేషన్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇవి తప్పుడు కార్డులను నిరోధించి, పారదర్శకతను పెంచుతాయి. ప్రతి లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల సన్న బియ్యం ఉచితంగా అందించనున్నారు. దీని ద్వారా రాష్ట్రంలో 3.1 కోట్ల మంది (84% జనాభా) ఆహార భద్రత పొందే అవకాశముంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో కేవలం 49,000 కార్డులు జారీ చేసినట్లు విమర్శిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా తెలిపారు.
రేషన్ కార్డులతో మొత్తం 3.14 కోట్ల మందికి లబ్ధి
కాగా జనవరి 26, 2025 నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టగా.. 4.43 లక్షల కొత్త కార్డులు, 17.55 లక్షల మంది సభ్యులకు ప్రయోజనం చేకూరింది. కొత్త కార్డుల జారీతో రాష్ట్రంలో మొత్తం 94.72 లక్షల రేషన్ కార్డులతో 3.14 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. ఈ కార్యక్రమం ఆహార భద్రతను నిర్ధారించడంతో పాటు, పేద, మధ్యతరగతి కుటుంబాలకు సంక్షేమ పథకాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాగా కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లై చేసిన వారు దాని స్టేటస్ తెలుసుకోవడానికి https://epds.telangana.gov.in/FoodSecurityAct/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ‘FSC Search’ ద్వారా చెక్ చేసుకోవచ్చు.