ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna)కు కాంగ్రెస్ పార్టీ భారీ షాక్ ఇచ్చింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ (Congress Disciplinary Committee) తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. గత కొంతకాలంగా సొంత పార్టీ, ప్రభుత్వంపై తీన్మార్ మల్లన్న బహిరంగంగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు ఆయణ్ను మందలించిన పార్టీ క్రమశిక్షణ కమిటీ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.
నోటీసులిచ్చినా నో రియాక్షన్
అయితే పార్టీ వ్యతిరేక చర్యలపై ఫిబ్రవరి 5వ తేదీన తీన్మార్ మల్లన్నకు క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు (Teenmar Mallanna Notices) జారీ చేసింది. దీనిపై వివరణ కోరింది. ఫిబ్రవరి 12లోపు వివరణ ఇవ్వాలని మల్లన్నకు గడువు ఇచ్చింది. గడువులోపు తీన్మార్ మల్లన్న నుంచి వివరణ రాకపోవడంతో సస్పెండ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయణ్ను సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది.
వాళ్లకు ఇదో వార్నింగ్
ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ పై స్పందించారు. మల్లన్న విషయంలో ఏఐసీసీ నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ ఆదేశాలతోనే తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించేవారికి ఇదో హెచ్చరిక అని పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఎవరైనా పార్టీలైన్ దాటితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.







