Mana Enadu : పార్లమెంటు శీతాకాల సమావేశాలు (Parliament Winter Sessions) కొనసాగుతున్నాయి. శుక్రవారం రోజున రాజ్యసభ సమావేశం ప్రారంభమైన తర్వాత ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ మాట్లాడుతూ.. గురువారం రోజున ఓ సభ్యుడి సీటు వద్ద రూ.500 నోట్ల కట్టను గుర్తించినట్లు ప్రకటించారు. ఛైర్మన్ ప్రకటనతో రాజ్యసభ (Rajya Sabha)లో కలకలం రేగింది. ఈ నోట్ల కట్టను కాంగ్రెస్‌కు చెందిన ఓ ఎంపీ సీటు వద్ద గుర్తించినట్లు చెప్పడం సభలో ప్రకటించడం తీవ్ర దుమారానికి దారి తీసింది. ఈ క్రమంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..?
రాజ్యసభలో కరెన్సీ కలకలం
రాజ్యసభ సమావేశం శుక్రవారం రోజున ప్రారంభం కాగానే ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar) మాట్లాడుతూ.. గురువారం సభను వాయిదా పడిన తర్వాత భద్రతా అధికారులు జరిపిన సాధారణ తనిఖీల్లో 222వ నంబరు సీటు వద్ద ఓ నోట్ల కట్టను గుర్తించారని తెలిపారు. అది తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ (Congress) ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ (Abhishek Manu Singhvi)కి కేటాయించిన సీటని.. ఈ విషయం తన దృష్టికి రాగానే దర్యాప్తునకు ఆదేశించానని వెల్లడించారు.
#WATCH | Rajya Sabha Chairman Jagdeep Dhankhar says, “I here by inform the members that during the routine anti-sabotage check of the chamber after the adjournment of the House yesterday. Apparently, a wad of currency notes was recovered by the security officials from seat number… pic.twitter.com/kN3q2pYaGL
— ANI (@ANI) December 6, 2024
ఖర్గే అసంతృప్తి
అయితే ఆ నోట్ల కట్టలో ఉన్నవన్నీ రూ.500, రూ.100 నోట్లేనని.. అవి అసలైనవో.. నకిలీవో స్పష్టత లేదని ధన్‌ఖడ్ తెలిపారు. ఈ విషయాన్ని సభకు చెప్పడం తన బాధ్యత అని పేర్కొన్నారు. ఛైర్మన్ ప్రకటన రాజ్యసభలో వివాదానికి దారితీసింది. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ఈ విషయాన్ని ఖండిస్తూ.. ఈ ఘటనపై విచారణకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అయితే దర్యాప్తు జరగకముందే సభ్యుడి పేరు చెప్పడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
సింఘ్వీ రియాక్షన్ ఇదే..
ఈ పరిణామాలపై కాంగ్రెస్ ఎంపీ సింఘ్వీ స్పందిస్తూ.. తాను కేవలం ఒకే ఒక్క రూ.500 నోటు తీసుకొచ్చానని స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితిని తానెన్నడూ చూడలేదని అన్నారు. గురువారం మధ్యాహ్నం 12.57 గంటలకు సభ లోపలికి వచ్చానని.. ఒంటి గంటకు సభ వాయిదా పడటంతో క్యాంటీన్‌కు వెళ్లి.. 1.30 గంటలకు పార్లమెంట్ నుంచి వెళ్లిపోయానని సింఘ్వీ వెల్లడించారు.