ప్రస్తుతం డిజిటల్ సేవల వినియోగం వేగంగా పెరుగుతోంది. అయితే, ఈ టెక్నాలజీ(technology) పెరుగుదలతో పాటు సైబర్(Cyber Alert) నేరాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సాధారణ ప్రజలను మోసం చేస్తున్నారు. చాలా మంది అప్రమత్తంగా లేకపోవడం వల్ల వారి వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు హ్యాకింగ్‌కు గురవుతున్నాయి.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అశ్రద్ధగా ఉండే వినియోగదారులను అప్రమత్తం చేస్తూ కీలక సూచనలు చేసింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) స్క్రీన్ షేరింగ్ యాప్‌లను వాడకూడదని హెచ్చరించింది. ఇప్పటికే ఫోన్‌లో ఉన్న వాటిని వెంటనే తొలగించాలని సూచించింది. ఈ యాప్‌లు మీ ఫోన్ స్క్రీన్‌ను నేరస్తులకు ప్రత్యక్షంగా చూపించడమే కాకుండా, బ్యాంకింగ్ ఓటీపీలు, మెసేజులు వంటి ముఖ్యమైన సమాచారాన్ని కాపాడే అవకాశం లేకుండా చేస్తాయి.
అనుమతుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త యాప్‌ను ఇన్‌స్టాల్ చేసినప్పుడు అడిగే అనుమతులను పూర్వ ఆలోచన లేకుండా ఇచ్చేయకూడదు. స్క్రీన్ షేరింగ్ యాప్‌లు మీ ఫోన్‌పై పూర్తి కంట్రోల్ కలిగి ఉండే అవకాశం కల్పిస్తాయి.
అలాగే, మీ సోషల్ మీడియా గోప్యతా సెట్టింగ్‌లను సరిగ్గా అమలు చేయాలి. ఫోన్ నంబర్, చిరునామా, ఫోటోలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని అందరికీ కనిపించకుండా పరిమితం చేయడం అవసరం.
అవసరమైన జాగ్రత్తలు:
స్క్రీన్ షేరింగ్ యాప్‌లను డిలీట్ చేయండి
యాప్ అనుమతులను జాగ్రత్తగా చదవండి
గోప్యతా సెట్టింగ్‌లు అప్డేట్ చేయండి
అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయకండి
ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను రెగ్యులర్‌గా అప్‌డేట్ చేయండి
ఇలాంటి జాగ్రత్తలతోనే మీరు సైబర్ మోసాల నుంచి రక్షణ పొందగలరు.






