దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. దాదాపు 27 ఏళ్ల తర్వాత హస్తినలో బీజేపీ (BJP) సర్కార్ పగ్గాలు చేపట్టనుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi CM)గా ఇవాళ (ఫిబ్రవరి 20) రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాంలీలా మైదానంలో జరగనున్న ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మరో ఆరుగురు మంత్రులు ప్రమాణం చేయనున్నట్లు సమాచారం.
ఆరుగురు మంత్రులు
ఢిల్లీ కేబినెట్ మంత్రులు (Delhi Cabinet Ministers)గా పర్వేశ్ వర్మ, ఆశిష్ సూద్, మంజీందర్ సిర్సా, పంకజ్ సింగ్, కపిల్ మిశ్రా, రవీంద్ర ఇంద్రజ్‌ల పేర్లు ఖరారయ్యాయి. వీరంతా ఇవాళ ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో పాటు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకకు బీజేపీ అగ్రనేతలతో పాటు బీజేపీ, ఎన్డీయేతర నేతలు హాజరుకానున్నారు.
కాసేపట్లో ప్రమాణ స్వీకారం
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi), ఎన్డీయే నేతల సమక్షంలో రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, ఆతిశీ మర్లేనా తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన నాలుగో మహిళగా రేఖా గుప్తా నిలిచారు. షాలిమార్‌బాగ్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన 50 ఏళ్ల రేఖా గుప్తాకు దిల్లీ సీఎం పగ్గాలు అప్పగించడం విశేషం.






