
ఇంటర్మీడియట్ విద్యార్థులకు అలర్ట్. ఇవాళ (ఫిబ్రవరి 20వ తేదీ) ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదల కానున్నాయి. బోర్డు వెబ్ సైటు నుంచి ఈ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు (Andhra Pradesh Intermediate Board) వెల్లడించింది. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు మొదలు పెట్టారు.
నేడే ప్రాక్టికల్స్ ముగింపు
ఏపీ వ్యాప్తంగా మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు (AP Inter First Year Exams), మార్చి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు. జనరల్ పరీక్షలు మార్చి 15వ తేదీతో ముగియనున్నాయి. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి నిర్వహిస్తున్న ప్రాక్టికల్ పరీక్షలు నేటితో పూర్తవుతాయి.
పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ
ఈ ఏడాదికి ఇంటర్ పరీక్షలకు మొత్తం 10,58,893 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. మొదటి సంవత్సరం 5,00,963 మంది జనరల్ విద్యార్థులు, 44,581 మంది ఒకేషనల్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. సెకండ్ ఇయర్ (Inter Second Year Exams) విద్యార్ధుల్లో 4,71,021 మంది జనరల్, 42,328 మంది ఒకేషనల్ విద్యార్థులు ఉన్నారు. పరీక్షలు జరిగే అన్ని గదుల్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.