
బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఆస్పత్రికి వెళ్లారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ (KCR At AIG Hospital) ఆస్పత్రికి వెళ్లిన ఆయన.. సాధారణ పరీక్షల కోసం ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన తిరిగి ఇంటికి చేరుకోనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక బుధవారం రోజున ఆయన సికింద్రాబాద్ పాస్ పోర్టు కార్యాలయానికి వెళ్లిన విషయం తెలిసిందే.
ఏడు నెలల తర్వాత
ఇక ఏడు నెలల తర్వాత బుధవారం రోజున మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ (Telangana Bhavan) కు వెళ్లారు. బీఆర్ఎస్ పార్టీ విస్తృత సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశంపై మాట్లాడారు. తప్పకుండా తెలంగాణలో ఉపఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు. త్వరలోనే మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మళ్లీ అధికారంలోకి వస్తాం
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. “పోరాడి సాధించుకున్న తెలంగాణ మళ్లీ వెనక్కిపోతోంది. పాతికేళ్ల స్ఫూర్తితో మళ్లీ రాష్ట్రాన్ని నిలబెట్టుకునేందుకు, ప్రజల కోసం పోరాటం చేయాలి. ప్రజల కష్టాలు బీఆర్ఎస్కు మాత్రమే తెలుసు. ఒక్కసారి ఓటమికే కొట్టుకుపోయే పార్టీ బీఆర్ఎస్ కాదు. వంద శాతం మళ్లీ అధికారంలోకి వస్తాం. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తాం.” అని కేసీఆర్ అన్నారు.