
నిత్యం ఆఫీసులో ఏసీ గదుల్లో కూర్చొని కార్యకలాపాలు నిర్వహించే కలెక్టర్ తాజాగా ప్రజల్లోకి వెళ్లారు. వారితో మాట్లాడుతూ వారి కష్టాలు తెలుసుకున్నారు. అంతేకాకుండా కూలీలతో కలిసి పలుగు పార పట్టి పనిలోకి దిగారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. అలా జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ (Bhadradri Collector) కూలీగా మారారు.
పలుగు పార పట్టిన కలెక్టర్
జిల్లాలోని టేకులపల్లి మండలంలో పలు గ్రామాల్లో కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రాంతానికి ఆయన వెళ్లారు. అక్కడ ఈజీఎస్ కూలీలతో కలిసి ఆయన పలుగు పార పట్టి మట్టి ఎత్తారు.
ఏసీ గది విడిచిన కలెక్టర్
దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో కలెక్టర్ ఉపాధి కూలీలతో ముచ్చటించి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఇక ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లంతా ఏసీ గదుల్లోనే ఉంటారని, వారు బయట ప్రజల్లో తిరగాలని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కలెక్టర్లు ఏసీ గదులు విడిచి ప్రజల్లో తిరుగుతున్నారు.