
పాకిస్థాన్ క్రికెట్ జట్టు(Pakistan cricket team).. అనిశ్చితికి మారుపేరు. బలమైన ఆస్ట్రేలియా లాంటి జట్లను ఓడిస్తారు. ఒక్కో సమయంలో పసికూన జట్లైన బంగ్లాదేశ్, USA వంటి జట్లపైనా చిత్తుగా ఓడిపోతుంది. ఈసారీ అదే జరిగింది. పైగా అది కూడా సొంతగడ్డపై ఓడింది. ఒకసారి అంటే ఓర్చుకోవచ్చు. కానీ పదేపదే ఇలానే జరుగుతుండటం ఆ దేశ మాజీలు, క్రికెట్ అభిమానులు(Fans) జీర్ణించుకోలేకపోతున్నారు. తెలిసిన మైదానాలు, అనుకూల వాతావరణంలో కూడా న్యూజిలాండ్(NZ)పై వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిపోయింది పాకిస్థాన్. ముందు త్రైపాక్షిక సిరీస్‌లో ఓడి టైటిల్ చేజార్చుకుంది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy-2025)లోనూ న్యూజిలాండ్ చేతిలో తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది. దీంతో పాక్ జట్టుపై ఆ దేశ ప్రజలు మండిపడుతున్నారు.
పాక్ జట్టు సామర్థ్యంపై అనేక అనుమానాలు
ఇక సొంతగడ్డపై పాక్ ఓటమిని అక్కడి మాజీలు(Ex Cricketers) తట్టుకోలేకపోతున్నారు. పాకిస్థాన్ టీంలో సత్తా లేదని, చావు చచ్చారంటూ రమీజ్ రాజా(Ramiz Raja) లాంటి వారు కామెంట్ చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీంతో పాక్ క్రికెట్ జట్టు సామర్థ్యంపై అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. ముఖ్యంగా బ్యాటింగ్(Batting) విఫలం కావడం, బౌలింగ్‌లో అనుకున్న స్థాయిలో ప్రభావం చూపించలేకపోవడం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి పాక్ టాప్ ఆర్డర్ కుప్పకూలడం, పాకిస్థాన్ బౌలర్లు సొంతగడ్డపై తేలిపోవడమే ఓటమికి దారితీసింది.
కివీస్ బౌలర్లను ఎదుర్కోవడంలో నానా తంటాలు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన తొలి మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ బ్యాటర్లలో ఇద్దరు సెంచరీలతో చెలరేగారు. మరో బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ T20 రేంజ్‌లో కేవలం 39 బంతుల్లోనే 61 పరుగులు బాదాడు. దీంతో కివీస్ నిర్ణీత 50 ఓవర్లకు 320 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో పాక్ తడబడింది. కివీస్ బౌలర్లను ఎదుర్కోవడానికి నానా తంటాలు పడింది. 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి జట్టు స్కోరు 40 దాటలేదంటే ఎంత ఘోరంగా బ్యాటింగ్ చేశారో అర్థమవుతోంది.
బాబర్ ఆజమ్‌పై ఫ్యాన్స్ ఫైర్
ముఖ్యంగా మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 90 బంతులు ఆడి కేవలం 64 రన్స్ చేశారు. టార్గెట్ భారీగా ఉన్నప్పుడు అన్ని బంతులను వృథా చేయడంతోనే ఇతర బ్యాటర్లపై ఒత్తిడి పెరిగిందని ఫైరవుతున్నారు. దీంతో పాక్ 47.2 ఓవర్లలో 260 పరుగులకు కుప్పకూలి ఘోర ఓటమిని చవిచూసింది. ఈ ఓటమి తర్వాత పాక్ జట్టు దుబాయ్‌లో భారత్‌తో జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఇంకెలా ఆడతారోనని ఆ దేశ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.