పవన్ కళ్యాణ్(Pawan Kalyan), దేవయాని(Devayani ) జంటగా నటించిన సినిమా ‘సుస్వాగతం’(Suswagatham). పవన్ కళ్యాణ్ హిట్ సినిమాల్లో ఒకటైన ‘సుస్వాగతం’ చిత్రంలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న దేవయాని, ఆ తర్వాత పవన్ తో కలిసి మళ్లీ నటించలేదు. అప్పట్లోనే తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దేవయాని, ఎందుకు పవన్‌తో మళ్లీ స్క్రీన్ పంచుకోలేకపోయిందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించింది.
భీమనేని శ్రీనివాసరావు(Bhimaneni Srinivasa Rao) దర్శకత్వంలో రూపొందిన ‘సుస్వాగతం’ సినిమాలో దేవయాని హీరోయిన్‌గా, ప్రకాశ్ రాజ్(Prakhas Raj) ఆమె తండ్రి పాత్రలో నటించారు. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన దేవయాని తర్వాత తెలుగులో కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. మహేష్‌బాబుతో ‘నాని’ సినిమాలో తల్లి పాత్రలో కనిపించి ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత ‘జనతా గ్యారేజ్’, ‘అరవింద సమేత’, ‘ఎన్టీఆర్ బయోపిక్’, ‘లవ్ స్టోరీ’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలలో నటించింది.

తాజాగా సిద్ధార్థ్(Sidharth) హీరోగా నటించిన ‘2BHK’ సినిమాలో నటించిన దేవయాని, చిత్రం ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌తో ‘సుస్వాగతం’ తర్వాత మళ్లీ కలిసి ఎందుకు నటించలేదనే ప్రశ్న ఎదురైంది.
దీనికి స్పందించిన దేవయాని, “నిజం చెప్పాలంటే నేను సినిమాల విషయంలో చాలా సెలక్టివ్‌గా ఉంటాను. ప్రతి కథను ఒప్పుకోను. పాత్ర నచ్చితేనే చేస్తాను. అందుకే నేను తక్కువగా కనిపిస్తున్నాను”. అదే కారణంగా పవన్‌తో మళ్లీ స్క్రీన్ షేర్ చేసే అవకాశం రాలేదని తెలిపింది.
అయితే, పవన్ కళ్యాణ్‌ను మళ్లీ కలిసారా? అన్న ప్రశ్నకు దేవయాని, “ఇంతవరకూ కలవలేదు. కానీ ఆయన మంచి వ్యక్తి. ఆయనతో పని చేయడం గొప్ప అనుభూతి. అది నా కెరీర్‌లో ఒక బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్. మంచి కథ వస్తే ఆయనతో మళ్లీ కలిసి నటించడానికి సిద్ధమే” అని చెప్పుకొచ్చింది దేవయాని. ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగులో జూలై 4న విడుదల కానున్న ‘2BHK’ చిత్రంలో దేవయాని కీలక పాత్ర పోషిస్తోంది.






