Mana Enadu : మహారాష్ట్రలో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై గత కొంతకాలంగా నెలకొన్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై తాజాగా ఉత్కంఠ వీడింది. బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడణవీస్ (Devendra Fadnavis) పేరును మహారాష్ట్ర నూతన సీఎంగా ఖరారు చేశారు.
మహారాష్ట్ర సీఎంగా ఫడణవీస్
ఈ మేరకు బుధవారం జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఫడణవీస్ పేరును ప్రతిపాదించారు. దీంతో ఆయన పేరును కోర్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. డిసెంబరు 5వ తేదీన ఆయన మహారాష్ట్ర (Maharashtra) సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు వెల్లడించాయి. (Maharashtra Next CM). కోర్ కమిటీ భేటీ తర్వాత ముంబయిలోని విధాన్ భవన్లో బీజేపీ (BJP) శాసనసభాపక్ష సమావేశం జరిగింది.
5న మహా సీఎం ప్రమాణం
ఈ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా ఉన్న నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman), విజయ్ రూపానీ హాజరై.. సీఎం ఎంపికపై పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించారు. అనంతరం బీజేపీ శాసనసభాపక్ష నేతగా దేవేంద్ర ఫడణవీస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం రోజున ఆజాద్ మైదానంలో జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ (PM Modi) సహా ఎన్డీయే కీలక నేతలు హాజరు కానున్నారు. ఇక మహారాష్ట్ర సీఎంగా ఫడణవీస్‌తో పాటు శివసేన నేత ఏక్నాథ్ శిందే (Eknath Shinde), ఎన్సీపీ నేత అజిత్ పవార్ (Ajit Pawar) ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఫలించిన బుజ్జగింపులు
288 శాసనసభ స్థానాలున్న మహారాష్ట్రలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. ఏకంగా 230 స్థానాలతో భారీ మెజార్టీ దక్కించున్నా సీఎం ఎంపిక, శాఖల కేటాయింపులపై బీజేపీ, శివసేన, ఎన్సీపీ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించని ఏక్నాథ్ శిందే, హోంశాఖ కేటాయించాలని పట్టుబట్టగా బీజేపీ హైకమాండ్ బుజ్జగింపులు మొదలుపెట్టినట్లు వార్తలు వచ్చాయి. చివరకు చర్చలు ఫలించినట్లు తెలుస్తోంది.