వరుస సెలవుల(Holidays) నేపథ్యంలో కలియుగ వైకుంఠం తిరుమల(Tirumala) తిరుపతి వేంకటేశ్వరస్వామి సన్నిధికి భక్తులు(Devotees) పోటెత్తారు. వరలక్ష్మీవ్రతం, రాఖీ పౌర్ణమి, ఆదివారం కలిపి వరుసగా మూడు రోజులు సెలవులు కలిసి రావడంతో భక్తులు శ్రీవారి దర్శనానికి భారీగా తరలివస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు అన్నీ నిండిపోయి వెలుపల క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక, టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతుంది. ఇక, నిన్న(ఆగస్టు 7) శ్రీవారిని 65,234 మంది భక్తులు దర్శించుకోగా.. 26, 133 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా, శ్రీనివాసుడి హుండీ ఆదాయం 3.8 కోట్ల రూపాయలు వచ్చింది.
పద్మావతి అమ్మవారి ఆలయంలో ‘సౌభాగ్యం’ కార్యక్రమం
మరోవైపు ఇవాళ (శుక్రవారం) వరలక్ష్మీ వ్రతం(Varalakshmi Vratham) నేపథ్యంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం(Tiruchanur Sri Padmavati Ammavari Temple)లో ‘సౌభాగ్యం’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మహిళలకు పండితులు అక్షింతలు, పసుపు దారాలు, కుంకుమ పంపిణీ చేస్తున్నారు. ఆలయ అధికారులు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూ లైన్లు, అన్నప్రసాదం, తాగునీరు, పుష్పాలంకరణలు ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటలకు స్వర్ణ రథంపై అమ్మవారు ఊరేగనున్నారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా TTD భారీ భద్రత ఏర్పాట్లు చేసింది. ఈ పర్వదినాలు ఆధ్యాత్మిక వాతావరణంతో సప్తగిరులను సందడిగా మార్చాయి.

రేపు శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ వాహన సేవ
ఇక ఇవాళ్టి నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు పున:ప్రారంభం కానున్నాయి. రేపు శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ వాహన సేవ జరగనుంది. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై భక్తులకు మలయప్ప స్వామి దర్శనం ఇవ్వనున్నారు. సెప్టెంబర్ లో వార్షిక బ్రహ్మోత్సవాలు నేపథ్యంలో రేపటి గరుడ సేవను ట్రయల్ రన్ గా టీటీడీ నిర్వహించనుంది.






