
గత మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం(Different Weather Situations) నెలకొంటోంది. ఉదయం 7 గంటల నుంచి మొదలుకొని మధ్యాహ్నం వరకూ తీవ్ర వడగాలు, భానుడు భగ్గుమనిపిస్తుంటే.. సాయంత్రం గాలిదుమారంతో కూడిన అకాల వర్షాలు(Rains) పడుతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ అకాల వర్షాలతో ఏపీ, తెలంగాణలోని రైతులు(Farmers) తీవ్రంగా నష్టపోతున్నారు. ఇక ఈరోజు (ఏప్రిల్ 26) కూడా వడగాలులతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయిని పేర్కొంది.
తెలంగాణలో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
ఈ మేరకు శనివారం, ఆదివారం తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు(High Temparatures) నమోదవుతాయని వాతావరణశాఖ(IMD) తెలిపింది. దీంతోపాటు అక్కడక్కడ తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మండే ఎండల నేపథ్యంలో ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, మహబూబ్ నగర్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరినగర్, మెదక్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్(Orange Alert) రానున్న రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మరోవైపు పలు జిల్లాల్లో రాత్రి సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ఏపీలో తీవ్ర వడగాల్పులకు అవకాశం
ఇక ఏపీ(Andhra Pradesh)లోను భిన్నమైన వాతావరణ పరిస్థితులకు అవకాశం ఉంది. శనివారం తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం(Amaravati Meteorological Center) పేర్కొంది. తీవ్రమైన ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, తూర్పుగోదావరి జిల్లాల్లో తీవ్ర వడగాడ్పులు వీయనున్నాయి. రేపు అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.