ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ‘పుష్ప 2 ది రూల్’ (Pushpa The Rule) బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. దాదాపు రూ.1800 కోట్ల వసూళ్లు రాబట్టింది. పుష్పరాజ్ పాత్రలో బన్నీ నటనకు తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ ఇండియన్ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. తాజాగా ఈ చిత్ర దర్శకుడు సుకుమార్ (Sukumar) ఓ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా ‘పుష్ప’లో హీరో పేరు పుష్ప రాజ్ అని ఎందుకు పెట్టారో.. దాని వెనక ఉన్న స్టోరీ ఏంటో చెప్పారు.
పుష్పరాజ్ పేరు వెనక స్టోరీ
“భారతదేశంలో ఎర్రచందనం స్మగ్లింగ్ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ విషయం గురించి లోతుగా పరిశీలించిన అనంతరం ఓ కథ రాసుకున్నా. అయితే మొదట వెబ్ సిరీస్ చేయాలని డిసైడ్ అయ్యాను. అందుకోసం చాలా రీసెర్చ్ చేశాను. అందులో భాగంగానే పలువురు స్మగ్లర్స్ ను కలిశాను. వారిని ఇంటర్వ్యూ చేసి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకున్నాను. అయితే నేను ఇంటర్వ్యూ చేసిన వారిలో ఒక స్మగ్లర్ పేరు పుష్పరాజ్. అతణ్ని అందరూ పుష్ప అని పిలిచేవారు. అదెందుకో నాకు చాలా నచ్చింది. ఆ పేరుకు అన్ని భాషల ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని అనిపించింది. అందుకే బన్నీ పాత్రకు పుష్పరాజ్ అని పేరు పెట్టా.” అని సుకుమార్ చెప్పుకొచ్చారు.
నువ్వు తమిళ వాసివి కాదా’
ఇక తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. చెన్నైలో తెలుగు పరిశ్రమ ఉన్న సమయంలో ఎడిటర్ మోహన్ వద్ద తాను అసిస్టెంట్‌గా వర్క్ చేశానని చెప్పారు సుకుమార్. ‘ఆర్య (Arya)’ తీసినప్పుడు తన పేరు విని చాలా మంది తనను తమిళనాడు వాసినని అనుకున్నారని చెప్పారు. ఆ మూవీ తీశాక తను ఎవర్ని కలిసినా వారు తమిళంలోనే మాట్లాడేవారని.. ‘పుష్ప 2’ విడుదలయ్యాక కూడా తెలుగులో సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna) ఫోన్ చేసి తనతో తమిళంలో మాట్లాడారని తెలిపారు. తాను తెలుగువాడినేనని చెప్పాక ఆయన ‘నువ్వు తమిళ వాసివి కాదా’ అని ఆశ్చర్యం వ్యక్తం చేశారని చెప్పారు.






