
ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యమ్ (MNM) పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్(Kamal Haasan) రాజ్యసభ(Rajya Sabha)కు వెళ్లడం దాదాపు ఖరారైంది. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో డీఎంకేతో కుదిరిన ఒప్పందం ప్రకారం MNMకు రాజ్యసభ సీటు కేటాయించారు. ఇందులో భాగంగా కమల్ హాసన్ అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటిస్తూ DMK తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది.
వచ్చే నెల 19న ఎన్నికలు
రాజ్యసభలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 8 స్థానాలకు వచ్చే నెల 19న ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో తమిళనాడు(Tamilnadu) నుంచి 6, అసోం నుంచి 2 స్థానాలు ఉన్నాయి. తమిళనాడులో ఈ స్థాయిలో DMKకు 134 మంది శాసనసభ్యులు ఉన్న నేపథ్యంలో ఆరు సీట్లలో నాలుగు డీఎంకేకు, మిగిలిన రెండు AIDMKకు దక్కే అవకాశాలు ఏన్నాయి.
2018లో మక్కల్ నీది మయ్యమ్ పార్టీ ఏర్పాటు
ఈ నేపథ్యంలో బుధవారం DMK తన నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. వారిలో కమల్ కూడా ఉన్నారు. మిగిలిన ముగ్గురు అభ్యర్థులు.. ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు విల్సన్, ప్రఖ్యాత రచయిత సల్మా, ఎస్.ఆర్. శివలింగం. దీంతో కమల్ హాసన్ రాజ్యసభలో అడుగుపెట్టడం ఖాయమేనని చెప్పవచ్చు. కాగా కమల్ హాసన్ 2018, ఫిబ్రవరి 21న మక్కల్ నీది మయ్యమ్ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. అయితే, అప్పటి నుంచి ఎంఎన్‌ఎం పార్టీ ఎన్నో ఎన్నికల్లో పాల్గొన్నప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రభావం మాత్రం చూపలేకపోయింది.