ManaEnadu : అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు (US Election Results 2024) షురూ అయ్యాయి. తొలి ఫలితాలు వచ్చేశాయి. ఈ ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ముందంజలో ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన 9 రాష్ట్రాల్లో ఘన విజయం సాధించారు. 95 ఎలక్టోరల్ ఓట్లను కైవసం చేసుకున్నారు. మరోవైపు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ (Kamala Harris) 35 ఎలక్టోరల్ ఓట్లను కైవసం చేసుకుని.. 5 రాష్ట్రాల్లో గెలుపొందారు. అగ్రరాజ్యంలో అధికారం చేపట్టాలంటే.. 270 స్థానాలను గెలవాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే.
ఓటెత్తిన అమెరికా
మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అగ్రరాజ్యానికి 47వ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు పోలింగ్ తేదీ అయిన మంగళవారం ఓటర్లు (US Polls 2024) కేంద్రాలకు భారీ ఎత్తున పోటెత్తారు. మంగళవారం స్థానిక కాలమానాల ప్రకారం.. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల మధ్య (భారత కాలమానం ప్రకారం సాయంత్రం) పోలింగ్ షురూ కాగా.. అర్ధరాత్రి వరకూ కొనసాగనుంది. అంటే భారత కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం 9 గంటల వరకూ కొనసాగుతుంది.
యూఎస్ ఎగ్జిట్ పోల్స్
ఇప్పటికే ఆరు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. అమెరికా ఎన్నికల్లో ఓటేసేందుకు 16 కోట్లకు మందికిపైగా రిజిస్టరు చేసుకోగా.. వారిలో 8.2 కోట్ల మంది ముందస్తుగా మంగళవారం కంటే ముందే ఓటేశారు. మరోవైపు ప్రజాస్వామ్య స్థితి, ఆర్థిక వ్యవస్థ, అబార్షన్ వంటివి ఈసారి ఎన్నికల్లో ఓటర్లకు అత్యంత ముఖ్యమైన అంశాలుగా నిలిచినట్లు ఆయా ప్రాథమిక ఎగ్జిట్ పోల్స్ (US Exit Polls 2024) వెల్లడించాయి.








