
Mana Enadu : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) మరికొన్ని రోజుల్లో ప్రెసిడెంట్ పదవి నుంచి దిగబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఫెడరల్ మరణశిక్షను (Federal Death Row) ఎదుర్కొంటున్న 40 మంది ఖైదీల్లో 37 మందికి శిక్ష తగ్గించారు. ఈ చర్యను కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఖండిస్తూ ట్రూత్ సోషల్ వేదికగా మండిపడ్డారు.
వాళ్లకు మరణశిక్ష
జో బైడెన్ దేశంలోని 37 మంది హంతకులకు మరణ శిక్ష(Death Penalty)ను తగ్గించారని.. తాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వెంటనే రేపిస్టులు, హంతకులకు మరణశిక్ష అమలు చేయాలని న్యాయశాఖను ఆదేశిస్తానని ట్రంప్ పేర్కొన్నారు. ఈ చర్య అమెరికన్ ప్రజలను రక్షిస్తుందని.. దేశంలో మళ్లీ శాంతిభద్రతలు పునరుద్ధరిస్తానని తెలిపారు.
ఆరు నెలల్లో 13 మందికి
ఇక అమెరికాలో తోటి ఖైదీలను హతమార్చిన వారు, బ్యాంకు దోపిడీల (Bank Robbery) సమయంలో హత్యలకు పాల్పడిన వారికి మరణశిక్ష అమలు చేస్తున్నారు. 1988 నుంచి 2021 వరకు మొత్తంగా 79 మందికి ఈ శిక్ష పడినప్పటికీ.. అత్యంత అరుదుగా వీటి అమలు కొనసాగుతోంది. ట్రంప్ మొదటిసారి అధికారం చేపట్టిన తొలి ఆరు నెలల్లోనే 13 మందికి శిక్ష అమలు చేశారు. చివరిగా జనవరి 16, 2021న శిక్ష అమలైంది.
ఈ ఏడాది 25 మరణశిక్షలు
ప్రస్తుతం ఈ జాబితాలో 40 మంది ఉండగా అందులో 37 మందికి తాజాగా జోబైడెన్ క్షమాభిక్ష కల్పించారు. బోస్టన్ మారథాన్ బాంబుదాడి కేసులో ఉన్న దోషితో సహా ముగ్గురికి ఉపశమనం లభించలేదు. మరోవైపు అమెరికాలోని 50 రాష్ట్రాల్లో 23 రాష్ట్రాలు మరణశిక్షను పూర్తిగా రద్దు చేశాయి. ఆరు రాష్ట్రాలు మాత్రం తాత్కాలికంగా నిలిపివేశాయి. మొత్తంగా 2024లోనే దేశవ్యాప్తంగా 25 మరణశిక్షలు అమలు చేసినట్లు సమాచారం.