పోర్న్ స్టార్‌కు హష్ మనీ వ్యవహారంలో అమెరికా (America)కు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ట్రంప్‌నకు శిక్ష విధిస్తానంటూ తాజాగా న్యూయార్క్ జడ్జి తెలిపారు. అయితే, ఆయన శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదని చెప్పారు. జరిమానా కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా అన్‌కండిషనల్ డిశ్చార్జ్’ని అమలు చేస్తామని వెల్లడించారు.
జైలు శిక్ష, జరిమానా అవసరం లేదు
హష్ మనీ కేసు (Hush Money Case)లో ట్రంప్‌నకు జనవరి 10వ తేదీన శిక్ష విధిస్తానని న్యూయర్క్ జస్టిస్ హవాన్ మర్చన్ ఆదేశాలు జరీ చేశారు. జనవరి 20వ తేదీన ట్రంప్ అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో జడ్జి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ట్రంప్ జైలు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదని, జరిమానా కూడా చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు.
ట్రంప్ పై కేసు కొట్టివేయాలి
అయితే శిక్ష విధించే రోజు ఆయన వ్యక్తిగతంగా లేదా వర్చువల్‌గా కోర్టులో హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. కాగా.. శిక్ష ఖరారై వైట్ హౌసులోకి అడుగు పెట్టే తొలి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నిలవనున్నారు. శిక్ష విధించాలనే న్యాయమూర్తి నిర్ణయాన్ని ట్రంప్ ప్రతినిధి స్టీవెన్ చియుంగ్ ఖండిస్తూ.. ఈ చట్ట విరుద్ధమైన కేసును వెంటనే కొట్టివేయాలని డిమాండ్ చేశారు.
రక్షణ కల్పించలేం
హష్ మనీ (Hush Money Case Update) కేసులో ట్రంప్ దోషిగా తేలారు. గతేడాది నవంబరులో న్యూయార్క్ కోర్టు శిక్ష ఖరారు చేయాల్సి ఉండగా.. ఆయన అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో క్రిమినల్ విచారణ ఎదుర్కోకుండా రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ ట్రంప్ కోర్టును ఆశ్రయించగా.. దీనిపై ఇటీవల కోర్టు విచారణ జరిపి శిక్షను నిరవధికంగా వాయిదా వేసింది. అనంతరం ఆయనకు ఇందులో రక్షణ కల్పించే అవకాశాలు లేవని తేల్చిన న్యాయస్థానం.. తాజాగా ఈ మేరకు తీర్పునిచ్చింది.







