సికింద్రాబాద్‌లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్(Universal Srushti Fertility Center)లో జరిగిన అక్రమ సరోగసీ(Illegal surrogacy), శిశు విక్రయ(Baby sale) రాకెట్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో పోలీసుల రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. రాజస్థాన్‌కు చెందిన ఓ దంపతులు గోపాలపురం పోలీసులను ఆశ్రయించడంతో ఈ తతంగం వెలుగులోకి వచ్చింది. 2024 ఆగస్టులో ఈ జంట IVF చికిత్స కోసం సెంటర్‌ను సంప్రదించగా, డాక్టర్ అత్తలూరి అలియాస్ పచ్చిపాల నమ్రత(Dr. Attaluri Namrata) సరోగసీని సూచించారు. ఈ ప్రక్రియ కోసం రూ.35 లక్షలు వసూలు చేసి, 2025 జూన్‌లో విశాఖపట్నంలో ఓ శిశువును అందజేశారు. అయితే, DNA పరీక్షలో ఆ శిశువు వారికి జన్యుపరంగా సంబంధం లేనిదని తేలింది.

రిమాండు రిపోర్టులో కీలక విషయాలు
కాగా ఈ విషయంపై పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత దర్యాప్తులో ఈ సెంటర్ 2021 నుంచి లైసెన్స్(License) లేకుండా నడుస్తున్నట్లు వెల్లడైంది. డాక్టర్ నమ్రత, ఆమె కుమారుడు పచ్చిపాల జయంత్ కృష్ణ(Pachipala Jayant Krishna)తో సహా ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఫెర్టిలిటీ సెంటర్ ముసుగులో అక్రమాలకు పాల్పడిన డాక్టర్ నమ్రతను 5 రోజుల పాటు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. సరోగసీ చేయకున్నా చేసినట్లుగా నమ్మించి పలువురు దంపతులను మోసం చేసినట్లు డాక్టర్ నమ్రత అంగీకరించారని రిమాండ్ రిపోర్టు(Remand Report)లో పేర్కొన్నారు.
Hyderabad police have busted a massive IVF and baby-selling racket run by Universal Srushti Fertility Centre. The clinic allegedly bought babies from poor couples for around ₹90,000 and sold them to desperate parents for up to ₹35 lakh, using forged documents to pass them off… pic.twitter.com/5uLUejRmXT
— Mid Day (@mid_day) July 28, 2025
రాష్ట్రవ్యాప్తంగా ఫెర్టిలిటీ సెంటర్లపై అధికారులు తనిఖీలు
ఈ రాకెట్‌లో గర్భవతులైన పేద మహిళల నుంచి శిశువులను రూ. 90,000కి కొనుగోలు చేసి, రూ.35 లక్షలకు విక్రయించినట్లు తెలిసింది. ఈ కేసులో నకిలీ పత్రాలు, అక్రమంగా గర్భం ధరించే ప్రక్రియలు జరిగాయని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు సృష్టి ఫెర్టిలిటీకి సంబంధించి హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలోని సెంటర్ బ్రాంచ్‌లను పోలీసులు సీజ్ చేశారు. గతంలో 2016, 2020లో కూడా నమ్రతపై ఇలాంటి ఆరోపణలు వచ్చినట్లు తెలుస్తోంది. భారతదేశంలో సరోగసీ విధానంపై నిషేధం ఉన్నప్పటికీ, ఈ సెంటర్ అల్ట్రూయిస్టిక్ సరోగసీ(Altruistic surrogacy) పేరుతో అక్రమ కార్యకలాపాలు నిర్వహించింది. ప్రస్తుతం పోలీసులు ఇతర బాధిత జంటలను గుర్తిస్తున్నారు. ఈ ఘటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఫెర్టిలిటీ సెంటర్లపై అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు.






