మ్యాడ్తో తెలుగు ప్రేక్షకులను అలరించిన అనంతిక సనీల్‌కుమార్ (Ananthika Sanilkumar) తోపాటు హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘8 వసంతాలు’ (8 vasanthalu). ‘మధురం’ షార్ట్ఫిల్మ్తో ఆకట్టుకున్న ఫణీంద్ర నరిశెట్టి దర్శకుడు. భారీ చిత్రాలు నిర్మించే మైత్రీ మూవీ మేకర్స్ తమ పంథాకు భిన్నంగా కథ, దర్శకుడిపై నమ్మకంతో చిన్న సినిమా అయిన ‘8 వసంతాలు’ నిర్మించింది. ఈరోజు (జూన్ 20న) విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం రండి..
ఇదీ కథ..
ఓ ప్రేమజంట జీవితంలోని 8 వసంతాల కథ ఇది. శుద్ధి అయోధ్య (అనంతిక సనీల్‌కుమార్) అనే యువతి ఓ రచయిత. ఊటీలో ఉంటూ తన టీనేజ్‌లోనే ఓ పుస్తకం రాస్తుంది. ఆ పుస్తకంతో ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకుంటుంది. ఆమెకు ప్రయాణాలంటే చాలా ఇష్టం. మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంటుంది. ప్రయాణాలు, రచనలు, మార్షల్ ఆర్ట్స్‌తో గడుపుతున్న ఆమె జీవితంలోకి వరుణ్ (హను రెడ్డి) వస్తాడు. శుద్ధిని ప్రేమించిన వరుణ్ తన మనసులోని మాటని ఆమెకు చెబుతాడు. అయితే శుద్ధి కొంత సమయం కావాలని కోరుతుంది. అలా కొన్ని నెలల తర్వాత శుద్ధి తన మనసులోని ప్రేమని వ్యక్తపరచాలని ఎంతో ఆత్రుతగా వరుణ్ దగ్గరికి వస్తుంది. కానీ ఆ తర్వాత ఏం జరిగింది? ఈ మధ్యలో వరుణ్ జీవితంలో ఏమయ్యింది? ఆ తర్వాత ఆమె జీవితంలోకి వచ్చిన సంజయ్ (రవి దుగ్గిరాల) ఎవరు? ఇలా పలు మలుపులతో కథ సాగుతుంది.
దర్శకుడి మాటలు.. అనంతిక నటన హైలైట్
ఫణీంద్ర నరిశెట్టి (Phanindra Narsetti) తన మార్క్ సంభాషనలతో మూవీని కవితాత్మకంగా తెరకెక్కించారు. తెరపైన కనిపించే ప్రతి ఫ్రేమ్, సంభాషణ అలరించాయి. ముఖ్యంగా విజువల్స్ కట్టిపడేశాయి. అయితే భావుకతపైనే ఎక్కువగా దృష్టిపెట్టిన దర్శకుడు.. భావోద్వేగాల సంగతి మరిచిపోయాడు. దాంతో కథ హృదయాలను హత్తుకోలేకపోయింది. సినిమాలోని హార్ట్ బ్రేక్ సన్నివేశాలే ఎక్కువగా ఉండడం ప్రేక్షకులకు రుచించకపోవచ్చు. ప్రథమార్ధం ఈ సినిమాకి బలం. వరుణ్, శుద్ధి కలవడం, ఆ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. విరామ సన్నివేశాలు ద్వితీయార్ధంపై ఆసక్తిని పెంచుతాయి. అనంతిక సనిల్‌కుమార్ (Ananthika Sanilkumar) అందం, నటన ఈ సినిమాకి ప్రత్యేకం. ఆమె స్క్రీన్ ప్రజెన్స్ ప్రేక్షకుల్ని కళ్లు తిప్పుకోనీయకుండా చేస్తుంది. హావభావాలు అద్భుతం అనిపిస్తాయి. నటుడు రవి దుగ్గిరాల తన పాత్రకు న్యాయం చేశాడు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది.






